ఉగ్రకుట్రలో అంతుచిక్కని టెక్నాలజీ
హైదరాబాద్: రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రమూకలు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్‌లను హ్యాకింగ్ చేయడం, అండర్ గ్రౌండ్ వెబ్ ద్వారా ఒక టీంను ప్రత్యేకంగా ఏర్పాటుచేయడాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. కస్టడీలో భాగంగా ఉగ్రకుట్రకు దారి తీసిన విధానంపై ఎన్‌ఐఏ అధికారులు లోతుగా అధ్యాయనం చేస్తున్నారు.
పేలుళ్ల కోసం ఉగ్ర సానుభూతి పరులు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండటంపై విచారణ జరుపుతున్నారు. చాటింగ్, ఈ-మెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపితే నిఘా అధికారులు గుర్తించే అవకాశం ఉండటం వల్ల వారు ఇతరుల ఐపీ అడ్రస్ లను దొంగిలించి వాటి ద్వారా వీడియో కాలింగ్, చాటింగ్ లు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా నిఘా వర్గాల హ్యాకింగ్ టూల్స్ కు చిక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన అండర్ గ్రౌండ్ వెబ్ ను తయారుచేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా కంప్యూటర్లలో ఉపయోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా అండర్ గ్రౌండ్ వెబ్ ను హ్యాక్ చేయడం కుదరదు.
ఇందుకోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్)ను పీసీల్లో ఇన్‌స్టాల్ చేయాల్సివుంటుంది. సోషల్ మీడియాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఈ ఓఎస్ లో కచ్చితంగా ఏదో ఒక సర్వర్ తో హోస్ట్ చేయాల్సివుంటుంది. అయితే, నిఘావర్గాలు ఉగ్రమూకలు వినియోగిస్తున్న ఈ సర్వర్ అడ్రస్ ఏమిటి? ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయి? నిర్వహిస్తున్నదెవరు? అన్న విషయాలను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా తెలుసుకున్న ఎన్ఐఏ ఉగ్రమూకల వ్యూహానికి చెక్ పెట్టింది.
సాంకేతిక పరిజ్ఞానం అందించిందెవరు..?
ఉగ్ర సానుభూతిపరులకు ఇంత పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం అందజేసిన వారిపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది. పట్టుబడిన వారందరూ అంతగా నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో వీరికి సహకారం అందించిన వారెవరు అనే కోణంలో అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కమ్యూనికేషన్స్ ఇన్ చార్జ్ గా భావిస్తున్న ఇబ్రహీంకు కూడా అంతగా తెలివితేటలు లేవని అంచనాకు వచ్చారు. వీరికి మధ్య ఎవరో మూడో వ్యక్తి ఉన్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు వాట్సప్‌లోని ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ద్వారా పెద్ద ఎత్తున సమాచారం మార్పిడి జరినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. దీనిని పూర్తిగా కోడింగ్ విధానం ద్వారా గత కొంత కాలంగా సిరియాలోని ఐఎస్ కీలక నేత షఫీ ఆర్మర్ తరచూ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ కోడింగ్ విధానాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు వాటిన పరిశీలిస్తున్నారు.