మనసులు ‘గెలిచారు’ | Hyderabad gives thumbs up to KCR and son | Sakshi
Sakshi News home page

మనసులు ‘గెలిచారు’

Published Sun, Feb 7 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

మనసులు ‘గెలిచారు’

మనసులు ‘గెలిచారు’

* గ్రేటర్ ఎన్నికల్లో ఏకపక్ష మద్దతు  
* కేసీఆర్‌పై ప్రజల్లో అచంచల విశ్వాసం
* సెటిలర్లదీ గులాబీ బాటే

 సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ డివిజన్‌లో చూసినా టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం ప్రజల ఏకపక్ష నిర్ణయానికి దర్పణం పట్టింది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్నిచోట్లా గులాబీ జెండా రెపరెపలాడింది. నగర ఓటర్లు అంతా ఒక్కవైపే మొగ్గు చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. జీహెచ్‌ఎంసీ చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి ‘తీర్పు’ రాలేదనిరాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంలను పక్కన పెట్టిన గ్రేటర్ ఓటర్లు టీఆర్‌ఎస్‌పై అంచంచల విశ్వాసాన్ని చూపించారు. ఈ ఆదరణకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. 19 నెలల టీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఇంటి పన్ను మినహాయింపు, కిలో రూపాయి బియ్యం, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పెంపు, రేషన్ కార్డుల వంటివి పేద, మధ్య తరగతి వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

షాదీ ముబారక్, విద్య, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు, రుణాల్లో సబ్సిడీ పెంపు వంటివి మైనారిటీలను పార్టీకి బాగా దగ్గర చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నగరంలో కరెంటు కోతలు లేకుండా చూడడంతో పాటు పారిశ్రామిక రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసి అన్ని వర్గాల మనసు దోచుకున్నారు. బస్తీల్లోని నిరుపేదలకు రేషన్ కార్డులు, వృద్ధులకు పింఛను రూ.500 నుంచి రూ.1000కి, వికలాంగులకు రూ.1500కు పెంచడం వంటివి బాగా ప్రభావం చూపాయి.

ఐటీ, ఇతర పారిశ్రామిక రంగాల్లో సరళీకృత విధానాలతో ఆ వర్గాల్లో కేసీఆర్ నమ్మకాన్ని పెంచారు. సెటిలర్లు టీఆర్‌ఎస్‌నే తమ పార్టీగా భావించడం గొప్ప విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలిచిన స్థానాల్లో ప్రజలు ఈసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కూకట్‌పల్లి మినహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం ఇతర పార్టీలకు మింగుడు పడడం లేదు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లు అక్కడ చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలను చూసి టీడీపీపై నమ్మకం కోల్పోయారు. కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసే చంద్రబాబు కంటే ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌నునమ్ముకోవడమే మేలని వారంతా భావించినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement