ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండీఏ | Hyderabad Metro Development Authority to be confine common capital | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండీఏ

Published Thu, Nov 14 2013 1:22 AM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM

ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండీఏ - Sakshi

ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండీఏ

సెమీ యూటీగా హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం చేతికి శాంతి భద్రతలు, భూమి, విద్య
తెలంగాణవాసులకు కోపం రాకూడదనే పై మూడు అంశాలతో సరి
శాంతి భద్రతలకు ప్రత్యేక ప్రాధికార సంస్థ
విద్య, భూ పరిపాలనకు అధీకృత అధికారి
హైదరాబాద్‌పై కేంద్రం యోచన
బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్‌కు జీవోఎం ప్రతిపాదన
‘సమ న్యాయం’గా చూపేందుకు అధికార కాంగ్రెస్ యత్నం
జైపాల్ సహా టీ కాంగ్రెస్ ప్రముఖులందరికీ ముందే సమాచారం
 
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను పాక్షికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు భావిస్తోందా? అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించనుందా? శాంతిభద్రతలు, భూ పరిపాలన, విద్యా విభాగాలకు సంబంధించి హెచ్‌ఎండీఏకు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించనుందా? అంటే, అవుననే అత్యున్నత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల విషయంలో హెచ్‌ఎండీఏను యూటీ చేయాలని కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సమావేశంలో మంత్రి వట్టి వసంతకుమార్ డిమాండ్ చేయడం ఈ వ్యూహంలో భాగమేనని సదరు వర్గాలు వివరించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రకు న్యాయం చేయాలన్న బీజేపీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జీవోఎం ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే, హైదరాబాద్‌ను యూటీగా చేస్తామంటే తెలంగాణ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు భగ్గుమనే ఆస్కారమున్నందున కేంద్ర పాలనను మూడు అంశాలకు మాత్రమే పరిమితం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! అంతేగాక కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో సహా ఇతర తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులందరికీ ఈ విషయమై ఇప్పటికే సమాచారం ఉందని తెలుస్తోంది. విభజన సాఫీగా సాగాలంటే కొన్ని అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని, హెచ్‌ఎండీఏను ఉమ్మడి రాజధానిగా ప్రకటించేందుకు సహకరించాలని వారితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
 
బీజేపీ సమన్యాయం కోసమేనా
తెలంగాణను విడదీసే క్రమంలో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవోఎం ఇలా ‘సెమీ యూటీ’ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. హెచ్‌ఎండీఏకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు తమ ప్రతిపాదనను బీజేపీ అగ్ర నేత, లోక్‌సభలో విపక్ష నేత అయిన సుష్మాస్వరాజ్‌కు జీవోఎం ఇప్పటికే అందజేసింది! దానిపై పార్టీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆమె వెల్లడించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై నవంబర్ 20 లోగానే నిర్ణయం వెలువడుతుందని ఉన్నతాధికార వర్గాలు ధ్రువీకరించాయి.
 
పోలీసు ‘ప్రాధికార’ సంస్థ
‘సెమీ యూటీ’ ఎత్తుగడ నేపథ్యంలోనే హెచ్‌ఎండీఏ సరిహద్దులు, జనాభా, విస్తీర్ణం, పోలీస్ స్టేషన్లు, విద్యా సంస్థలు, రెవెన్యూ వంటి పూర్తి సమాచారాన్ని కేంద్రం ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లను విలీనం చేసి ఆ మొత్తం ప్రాంత శాంతిభద్రతలను ప్రత్యేక ప్రాధికార సంస్థకు అప్పగిస్తారు. డీజీపీ స్థాయి అధికారి దానికి నేతృత్వం వహిస్తారు. పూర్తిగా గవర్నర్ అధీనంలో పనిచేసే ఈ సంస్థలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. పోలీసు సిబ్బంది నియామకం, పోస్టింగులు, బదిలీల అధికారమూ ఈ సంస్థకే ఉంటుంది. దీనికిగాను ప్రాధికార సంస్థ అధికారితోపాటు రెండు రాష్ట్రాల ప్రతినిధులతో పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్ ఏర్పాటవుతుంది. ఈ బోర్డు సిఫారసుల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు.
 
గవర్నర్ చేతిలోనే భూ పరిపాలన
హెచ్‌ఎండీఏ పరిధిలో భూ పరిపాలనను కూడా గవర్నర్ ఆధ్వర్యంలో పని చేసే అధీకృత అధికారి నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉండే సదరు అధికారి నేతృత్వంలోని కమిటీ భూ కేటాయింపులకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. ఈ కమిటీలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్థానం కల్పిస్తారు. అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన విధి విధానాలను కూడా ఈ కమిటీయే పర్యవేక్షిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికిగాను ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. కేంద్ర పాలనలో ఉండే అంశాలను పర్యవేక్షించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరిమిత కాలానికి కేంద్ర ప్రభుత్వ కేడర్ అధికారులుగానే పరిగణిస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement