
ములాయం సింగ్ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదివారం ఉదయం పార్టీలో ఎలాంటి వివాదం లేదని చెప్పిన ములాయం సింగ్ యాదవ్.. సాయంత్రానికల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా సమావేశంలో ములాయం మాట్లాడుతూ తానే ఎస్పీ జాతీయ అధ్యక్షుడినని ప్రకటించారు. పార్టీలో తానే సుప్రీం అని, తాను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ యూపీ పార్టీ చీఫ్‌గా కొనసాగుతారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
ఇటీవల ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేష్ యాదవ్ వర్గం.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయం నుంచి తొలగించి ఆయన స్థానంలో అఖిలేష్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అలాగే యూపీ పార్టీ చీఫ్ పదవి నుంచి శివపాల్‌ను తొలగించారు. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్‌పై వేటు వేశారు. కాగా పార్టీలో ఎక్కువ మంది అఖిలేష్ పక్షాన నిలవగా, ములాయం వెంట చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇరు వర్గాలు ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ గుర్తు సైకిల్‌ను తమకే కేటాయించాలని విన్నవించారు. ఇరు వర్గాలు రాజీకోసం చర్చలు జరుపుతూనే ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. శనివారం జరగాల్సిన మీడియా సమావేశాన్ని ములాయం చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్పిన ములాయం.. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలను ప్రకటించారు. అఖిలేష్, రాంగోపాల్‌లను పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఇటీవల ప్రకటించిన ములాయం తర్వాత సస్పెన్షన్‌ను తొలగించారు. తాజాగా రాంగోపాల్ ఒక్కరినే బహిష్కరించినట్టు ప్రకటించారు.