రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకం : డిప్యూటీ సీఎం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మరో సారి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. రాజధానిలో భూ సేకరణకు నేను వ్యతిరేకమని ఆయన గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ భూ సేకరణ చేస్తామంటున్నారు.... దీనిపై తాను మాట్లాడనని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.
గ్రామ కంఠాలు రైతులు వినియోగంలో ఉంటే వారికే ఇచ్చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో భూ సేకరణకు... తమ శాఖకు ఎటువంటి సంబంధం లేదని కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధాని కోసం రైతుల చాలా భూములు ఇచ్చారని... ఇంకా భూ సేకరణ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే రాజధాని భూసేకరణ చేసేటట్లయితే రెవెన్యూ శాఖ ద్వారానే జరగాలి. కానీ ఆ శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారం సాగుతుందని కేఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. రాజధాని వ్యవహారం అంతా మంత్రి పి.నారాయణ తానై వ్యవహరిస్తున్నారు. దాంతో నారాయణపై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేఈ వ్యాఖ్యలతో ఇది మరో మారు స్పష్టమైంది.