'ల్యాండ్ పూలింగ్ విధానానికే కట్టుబడి ఉన్నాం'
చిత్తూరు: ఏపీ రాజధాని ప్రాంతంలో మరోసారి భూసేకరణ చేపడితే ధర్నా చేస్తానని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు స్పందించారు. తమ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానానికి కట్టుబడి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదన్నారు. పవన్ కల్యాణ్ కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసమీకరణ చేసుకోమన్నారని నారాయణ తెలిపారు. 2019 కల్లా రాజధాని నిర్మాణం పూర్తికావాలంటే రైతులు ముందుకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రాజధాని భూసేకరణ విషయంలో పవన్ కల్యాణ్ సూచనలను ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకోవాలని మరోమంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పవన్ కల్యాణ్ ఏ పదవి ఆశించకుండా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీలు అధికారంలోకి రావడానికి కృషి చేశారన్నారు.