మీ బాధ నాకు తెలుసు, సాయం చేస్తాను: మోదీ
అలహాబాద్ (ఉత్తరప్రదేశ్): న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తొలగించేందుకు, పెండింగ్ కేసుల తగ్గించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సాయం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్‌కు హామీ ఇచ్చారు. 'న్యాయవ్యవస్థపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలన్న చీఫ్ జస్టిస్ సంకల్పానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నేను ఆయనకు హామీ ఇస్తున్నాను' అని మోదీ అన్నారు.
అలహాబాద్ హైకోర్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖేహర్ మాట్లాడుతున్నప్పుడు ఆయనలోని బాధ తనకు అర్థమైందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 1200 పాత చట్టాలను తొలగించి.. న్యాయవ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేసిందని అన్నారు. కోర్టుల పనితీరును సరళీకరించేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు టెక్నాలజీ వినియోగాన్ని చీఫ్ జస్టిస్ తీసుకొచ్చారంటూ మోదీ ప్రశంసించారు.