
ఆరోపణలు రుజువైతే రాజీనామాకు సిద్ధం: గడ్కారీ
న్యూఢిల్లీ: కాగ్ నివేదిక నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దీనిపై ఆర్థిక శాఖ విచారణకు సిద్ధమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. తాను తప్పు చేయలేదని, ఆరోపణలన్నింటికీ సమాధానాలు ఉన్నాయన్నారు.
‘ప్రపంచంలోని ఏ కోర్టులోనైనా నాపై ఆరోపణలు నిరూపితమైనా.. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు తేలినా మంత్రి పదవికి, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజీనామా చేస్తా’ అని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు చెందిన పుర్తీ గ్రూప్‌నకు రుణ మంజూరీలో అక్రమాలు జరిగాయన్న కాగ్ నివేదికపై ప్రతిపక్షాలు నిలదీస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆ నివేదికలో తనపై ఆరోపణలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.