లంచగొండి అధికారుల్ని హెలికాప్టర్ నుంచి తోసేస్తా!
మాదక ద్రవ్యాలపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపి.. వేలాదిమందిని చనిపోవడానికి కారణమైన ఫిలిపీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్తే మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే.. వారిని హెలికాప్టర్ నుంచి తోసేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తాను ఓ కిడ్నాపర్ ను ఇలాగే హెలికాప్టర్ నుంచి పారేశారనని, ఇప్పుడు అధికారుల్ని తోసేయడానికి ఏమాత్రం వెనుకాడబోనని బెదిరించారు.
'హెలికాప్టర్‌లో మనీలాకు మిమ్మల్ని తీసుకెళ్తూ.. దారిలో మిమ్మల్ని తోసిపారేస్తా' అని డ్యుటర్తే అన్నారు. క్యామరిన్స్ సర్ ప్రావిన్స్‌లో జనాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన 'నేను గతంలో కూడా చేశాను. ఇప్పుడెందుకు చేయకూడదు' అంటూ అధికారుల్ని బెదిరించారు. మాజీ మేయర్, ప్రాసిక్యూటర్ అయిన డ్యుటర్తే దేశం ఎదుర్కొంటున్న డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలిస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చారు. అన్నట్టుగానే ఆయన అత్యంత హింసాత్మకంగా, డ్రగ్స్ బాధితులు కనిపిస్తే కాల్చిపారేసే తరహాలో ఆదేశాలు ఇచ్చి.. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నారు.