చిరాకు పుట్టి చంపేశాడు! | IAS officer's son confessed to driver Nagaraju murder case | Sakshi
Sakshi News home page

చిరాకు పుట్టి చంపేశాడు!

Published Wed, Mar 22 2017 4:08 AM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

మృతుడు నాగరాజు, నిందితులు సుకృత్‌, డీవీ రావు - Sakshi

మృతుడు నాగరాజు, నిందితులు సుకృత్‌, డీవీ రావు

- వీడిన జూబ్లీహిల్స్‌ హత్య కేసు మిస్టరీ
- ఐఏఎస్‌ అధికారి డీవీ రావు, అతడి కుమారుడు సుకృత్‌ అరెస్టు
- మద్యం మత్తులో స్వలింగ సంపర్కానికి యత్నించిన నాగరాజు
- చిరాగ్గా ఇటుకతో మోది చంపేసిన సుకృత్‌
- ఈ విషయాన్ని తండ్రికి చెప్పిన సుకృత్‌
- శవాన్ని మాయం చేసేందుకు తండ్రీ కొడుకుల ప్రయత్నం


సాక్షి, హైదరాబాద్‌:
జూబ్లీహిల్స్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధమే ఆ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అంతేకాదు తన కుమా రుడు సుకృత్‌ హత్య చేసిన డ్రైవర్‌ నాగరాజు మృతదేహాన్ని మాయం చేయడానికి ఐఏఎస్‌ అధికారి దారావత్‌ వెంకటేశ్వర్‌రావు (డీవీ రావు) స్వయంగా ప్రయత్నించారనీ గుర్తించా రు. ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు డీవీ రావు తెలివిగా చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసి.. తండ్రీకొడుకులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

ఇటుకతో కొట్టి..
ఐఏఎస్‌ అధికారి డీవీ రావు, ఆయన భార్య విడాకులు తీసుకుని కొంత కాలంగా వేర్వేరుగా నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు సుకృత్, శశాంక్‌. ఇద్దరూ తల్లివద్దే ఉంటారు. సుకృత్‌ తల్లి వద్ద బూక్యా నాగరాజు ఆరేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో సుకృత్, నాగరాజు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. వారు అప్పుడప్పుడూ కలసి మద్యం తాగడంతోపాటు అనైతిక కార్యకలాపాలకు (స్వలింగ సంపర్కానికి) పాల్పడేవారు. యూసుఫ్‌గూడలోని సాయి కల్యాణ్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌తో నాగరాజుకు పరిచయం ఉండటంతో శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి అక్కడకు వెళ్లారు. వాచ్‌మన్‌ లేకపోయినా ఎప్పటిలాగే అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పైకి వెళ్లి మద్యం తాగారు. రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న నాగరాజు సుకృత్‌తో స్వలింగ సంపర్కానికి యత్నించాడు. దీంతో చిరాకు పుట్టిన సుకృత్‌.. అక్కడున్న ఇటుకతో నాగరాజు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు.

శవాన్ని మాయం చేయమన్న తండ్రి
నాగరాజును చంపిన సుకృత్‌ రాత్రి 11.30 సమయంలో మధురానగర్‌లోని తల్లి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో తండ్రి డీవీ రావుకు ఫోన్‌ చేసి హత్య విషయం చెప్పాడు. దీంతో ఆ శవాన్ని మాయం చేయాల్సిందిగా డీవీ రావు సూచించాడు. దీంతో సుకృత్‌ రాత్రి ఒంటి గంట సమయంలో మరోసారి అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి.. నాగరాజు మృతదేహాన్ని చూసి వెళ్లాడు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది కూడా. మృతదేహాన్ని మాయం చేసే విషయమై డీవీ రావు, సుకృత్‌ శనివారం సాయంత్రం దాకా ఆలోచించారు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో బేగంపేటలోని ఇంటి నుంచి మధురానగర్‌ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వారి చిన్న కుమారుడు శశాంక్, అతడి స్నేహితుడు శ్యామ్‌ ఆ ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపట్లోనే తిరిగొస్తానని శ్యామ్‌ తో చెప్పిన శశాంక్‌ తల్లి కారులో తండ్రితో కలిసి వెళ్లాడు. ముగ్గురు అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి, కొద్ది దూరంలో కారు ఆపారు.

సాంకేతిక ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో వారి సెల్‌ఫో న్లను స్విఛాఫ్‌ చేసుకున్నారు. సుకృత్‌ టెర్రస్‌ పైకి వెళ్లి.. నాగరాజు మృతదేహాన్ని మూటకట్టి కిందికి తీసుకువచ్చే యత్నం చేశాడు. ఈ సమ యంలో శబ్దం కావడంతో అపార్ట్‌మెంట్‌లో నివసించే జానకిరామ్‌ గమనించారు. ఎవరు నువ్వంటూ ఆయన నిలదీయడంతో సుకృత్‌ పారిపోయాడు. దాంతో ఆయన ‘దొంగ.. దొంగ’అని అరవడంతో కింద వేచి ఉన్న ఇద్దరూ పారిపోయారు. కొద్దిసేపటికే డీవీ రావు, శశాంక్‌ ఇద్దరూ మధురానగర్‌లోని ఇంటికి వచ్చారని శశాంక్‌ స్నేహితుడు శ్యామ్‌ పోలీసులకు వెల్లడించాడు. మధురానగర్‌ నుంచి డీవీ రావు, శశాంక్, శ్యామ్‌ బేగంపేట నివాసానికి వెళ్లే సరికి సుకృత్‌ అక్కడ ఉన్నాడు. అయితే అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న పళ్ల దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి.. డీవీ రావు, సుకృత్‌లను గుర్తించినా..శశాంక్‌ను గుర్తించ లేదు. దీంతో మూడో వ్యక్తి శశాంకేనా.. లేక డీవీ రావు మరెవరినైనా తీసుకుని అపార్ట్‌మెం ట్‌ వద్దకు వచ్చాడా అన్నదానిపై పోలీసులు పరిశీలన చేస్తున్నారు.
(ఐఏఎస్‌.. కొడుకు.. డ్రైవర్‌..)
అతి తెలివి ప్రదర్శించిన ఐఏఎస్‌..
డీవీ రావు గతంలో మూడేళ్ల పాటు  ఎస్సైగా కూడా పనిచేశాడు. ఆ అనుభవంతో ఈ హత్య ఘటన నుంచి తప్పించుకొనేందుకు తామే ముందుగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తమ
డ్రైవర్‌ నాగరాజు కనిపించట్లేదని, మద్యం తాగి పడిపోయే అలవాటు అతడికి ఉందని ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌ను వెతుక్కుంటూ తన కుమారుడు సుకృత్‌ సాయి కల్యాణ్‌ రెసిడెన్సీ వద్దకు వెళ్లగా.. అపార్ట్‌మెంట్‌ వాసులు దొంగగా భావించి అరిచారని, దీంతో భయపడి వెళ్లిపోయాడని చెప్పాడు. అయితే పోలీసులు అప్పటికే నాగరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం, అతడి భార్యకు సీసీ కెమెరా ఫుటేజీలు చూపించగా ఆమె సుకృత్, డీవీ రావులను గుర్తించడం జరిగాయి.  పోలీ సులు డీవీ రావు ద్వారానే సుకృత్‌ను పోలీసుస్టేషన్‌ను రప్పించి అదుపులోకి తీసుకు న్నారు. వారిని విచారించగా..అసలు విషయా లు బయటపెట్టారు. దీంతో డీవీ రావు ,సుకృత్‌ లను మంగళవారం అరెస్టు చేశారు.

అవినీతి కేసు నుంచి తప్పించుకుని..
విశాఖపట్నం ఆర్డీవో గా పనిచేస్తున్న సమయంలోనే డీవీ రావు అవినీతిపై ఏసీబీ దృష్టి పడింది. దానిపై కేసు కూడా నమోదు కావడంతో ఆయన కోట్లాది రూపాయల ఆస్తులను భార్య, ఆమె తరఫు బంధువుల పేర్ల మీద రాసినట్లు తెలిసింది. అదే సమ యంలో భార్య తో విడాకులు తీసుకుని.. ఆ ఆస్తులతో తనకు సంబంధం లేదంటూ కేసు నుంచి తప్పించుకు న్నట్లు తెలిసింది. అలా విడిపోయిన వెంకటేశ్వ ర్లు బేగంపేటలో, ఆయన భార్య మధురాన గర్‌ లో నివాసముంటున్నారు. ఇలా వేర్వేరు గా నివసిస్తున్నా.. భార్యాభర్తల బంధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఆధారాలున్నా యని పోలీసులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement