అవసరమైతే మేమే ఫండింగ్ చేస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థూలదేశీయోత్పత్తి వృద్ధిలో యువ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే కొత్త కంపెనీ (స్టార్టప్స్)ల భాగస్వామ్యం రోజురోజుకూ అత్యంత కీలకంగా మారుతుందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్‌అలిస్టర్ అన్నారు. భవిష్యత్తులో భారతదేశానికి చెందిన స్టార్టప్స్ ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్టార్టప్స్‌కు మార్గదర్శనం చేయడంతోపాటు నిధులు సమకూర్చడానికి ప్రతి ఏటా ఏర్పాటు చేసే టై-ఐఎస్‌బీ కనెక్ట్ గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆండ్రూ మెక్‌అలిస్టర్ మాట్లాడుతూ.. అవసరమైతే ఇండియన్ స్టార్టప్ కంపెనీల్లో, అందులోనూ సామాజిక కంపెనీల్లో బ్రిటీష్ ప్రభుత్వమే ఫండింగ్ చేస్తుందన్నారు.
అలాగే యూకేలో సేవలందించే ందుకు ముందుకొచ్చే కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహం పెరగడమే కాకుండా స్నేహభావం ఏర్పడుతుందన్నారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు మాట్లాడుతూ.. స్టార్టప్స్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు గాను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ సెంటర్‌ను మే నెలల్లో ప్రారంభించనున్నామన్నారు. స్టార్టప్స్ కంపెనీలకు నిధుల సమీకరణ చేసేందుకుగాను టెక్నాలజీ ఫండింగ్ బ్యాంక్‌ను ఏర్పాటు యోచనలో ఉన్నామన్నారు.
దీంతో ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను స్టార్టప్స్ రాజధానిగా మారుతుందని చెప్పారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు సఫిర్ అదేని మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన టై-ఐఎస్‌బీ కనెక్ట్‌లో ప్రారంభ మూలధనం కోసం ఎదురుచూస్తున్న స్టార్టప్‌లకునిధులు సమకూర్చడంపై దృష్టి కేంద్రీకరించే వారమని, ఈ సారి మాత్రం 2-3 ఏళ్లుగా కార్యకలపాలు నిర్వహిస్తూ రెండో విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న స్టార్టప్‌లకు నిధులు అందించడంపై దృష్టి పెట్టామన్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే రూ.70-80 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్న 60కిపైగా కంపెనీలు దరఖాస్తులను నమోదు చేసుకున్నాయన్నారు. ఇందులో నుంచి 33 కంపెనీలను ఎంపిక చేశామన్నారు. ఆయా కంపెనీలు మరింత విస్తరించడానికి ఒక్కొక్క కంపెనీకి రూ.10-50 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 15 వెంచర్ కేపిటల్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.