ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే పరిస్థితేమిటి?
ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే పరిస్థితేమిటి?
Published Fri, Mar 10 2017 3:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
ముంబై : మార్కెట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఇక మిగిలి ఉంది ఎన్నికల తుది ఫలితాలే. మార్కెట్లకు సానుకూలంగా బీజేపీ విక్టరీకే జై కొడుతూ ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం తమ ఫలితాలను విడుదల చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల మాదిరి కమలం మరింత వికసించబోతుందో లేదో తేలడానికి ఇక మిగిలి ఉంది ఒక్కరోజే. ప్రజానాడిని పట్టిచూసిన సర్వేల అంచనాలు తప్పితే మార్కెట్ల పరిస్థితేమిటి? ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు తేస్తూ ఫలితాలు వెల్లడైతే, మార్కెట్లు భారీగా కుదేలవడం లేదా ఒక్క ఉదుటున పెరగడాన్ని తోసిపుచ్చరాదని విశ్లేషకులంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల మాదిరి అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ తన పాగవేస్తే, మార్కెట్లో కొనుగోల పర్వం కొనసాగుతుందని, మంచి ర్యాలీని నిర్వహిస్తాయని చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలుకు కూడా మార్గం సుగుమవుతుందంటున్నారు. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్ ల పొత్తు యూపీని తన పరం చేసుకుంటే, మార్కెట్లు తాత్కాలికంగా కరెక్షన్ కు గురయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారీ సంస్కరణల అమలు కూడా మోదీకి కష్టమవుతుందట.
నిన్న వెలువరిచిన ఫలితాల్లో ఆరు పోల్స్ లో రెండు యూపీలో బీజేపీకి క్లియర్ మెజారిటీ ఇవ్వగా.. మిగతా నాలుగు బీజేపీ యూపీలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని చెప్పాయి. అయినప్పటికీ మార్కెట్లు ఫ్లాట్ గానే ట్రేడవుతున్నాయి. పాజిటివ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఊగిసలాట ధోరణిలో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఫలితాలు వస్తాయా? లేదా అని వేచిచూస్తున్నాయి. అంచనాలకు అనుకూలంగా ఫలితాలు వస్తే నిఫ్టీ ఒక్కసారిగా 200 పాయింట్లు పెరిగినా సందేహం లేదని కొటక్ మ్యూచువల్ ఫండ్ ఎండీ నిలేష్ షా అంటున్నారు. యూపీలో బీజేపీకి క్లియర్ మెజారిటీ ఎఫ్‌ఐఐల తాజా కొనుగోళ్లకు దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ నే పూర్తిగా నమ్మొద్దని, వాటిలో ఎలాంటి కచ్చితత్వం ఉండదనీ మరికొంతమంది విశ్లేషకులంటున్నారు. 403 సీట్లలో బీజేపీకి 285 సీట్లు వస్తాయని చాణక్య చెప్పగా.. మిగతా పోల్స్ కూడా బీజేపీకే జై కొట్టాయి. ఒక్క యూపీలోనే కాక, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే వస్తుందని, ఒక్క పంజాబ్ లో మాత్రం ఆప్, కాంగ్రెస్ ల మధ్య పోటీ హోరాహోరిగా ఉంటుందని తేల్చాయి. యూపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ వస్తే, మార్కెట్లో మంచి ర్యాలీని చూస్తామని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చైర్మన్ మోతిలాల్ ఓస్వాల్ చెప్పారు. ఈ గెలుపుతో మోదీ భారీ సంస్కరణలకు తెరలేపేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
Advertisement