తమిళనాడులోని మదురై శివార్లలో జల్లికట్టు సందర్భంగా జనంపైకి దూకుతున్న పోట్లగిత్త
సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోని జనం
చెన్నై/చంద్రగిరి: సుప్రీంకోర్టు వద్దన్నా.. సాంప్రదాయ ఆట ఆగలేదు. తమిళనాడులోని మదురై శివార్లలో శనివారం ఎప్పటిలాగే ఘనంగా జల్లికట్టును నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్డినెన్సు తేవాలని కేంద్రాన్ని తమిళనాడు అధికార విపక్షాలు కోరటం, ప్రజలు కూడా రోడ్లపై నిరసనలు చేపట్టిన సందర్భంలో.. ఈ క్రీడపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం మదురైతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా జల్లికట్టు జరుపుకున్నారు.
చిత్తూరు జిల్లాలోనూ...
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో నిర్వహించే ఎడ్ల పందేల(జల్లికట్టు)ను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆవులు, ఎద్దులు, కోడెగిత్తలను గుంపులు గుంపులుగా పరుగులెత్తించారు. జల్లికట్టులో గెలుపొందిన వారు చెక్క పలకలను చే త పట్టుకుని విజయగర్వంతో ఊగిపోయారు. జల్లికట్టు సందర్భంగా రంగంపేట గ్రామం జనంతో నిండిపోయింది.
చిత్తూరు జిల్లా రంగంపేటలో నిర్వహించిన జల్లికట్టులో పరుగులు తీస్తున్న పోట్లగిత్తలు