ముంబై: బెటర్ మాన్‌సూన్ అంచనాలు దలాల్ స్ట్రీట్ లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈసారి రుతుపవనాలు బాగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలపై వాతావరణ శాఖ అనుకూలమైన అంచనాలతో ఎరువులు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ మేకర్స్ ఎఫ్ఎంసిజి కంపెనీలకు మంచి డిమాండ్ పుట్టింది. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 2 శాతానికిపైగా లాభాలతోబిఎస్ఇలో టాప్ సెక్టార్‌గా నిలిచింది.
బుల్‌రన్‌లో ఇతర సెక్టార్లతోపాటు,ఎరువులు, విత్తనాలు కంపెనీల షేర్లపై మదుపర్ల ఆసక్తి నెలకొంది. కొనుగోళ్ల ధోరణి భారీగా కనిపిస్తోంది. దీంతో అన్నిఫెర్టిలైజర్స్, ఇతర విత్తనాల కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్‌సీఎఫ్ 4.85 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 2.5 శాతం, జీఎస్ఎఫ్‌సీ 1.8 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2.4 శాతం, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 3.66 శాతం, జువారి ఆగ్రో 2 శాతం, అగ్రి టెక్ 4 శాతం పైగా పెరిగాయి. అలాగే జైన్ ఇరిగేషన్, ర్యాలీస్ ఇండియా ఎస్కార్ట్స్ లాభపడుతున్నాయి.
దీంతోపాటు స్టాక్‌మార్కెట్‌లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో జోరు కనిపిస్తోంది. ఈ రంగంలోని దాదాపు అన్ని స్టాక్స్‌లోను కొనుగోళ్లు పెరిగాయి. ఐటీసీ, ఇమామి, బ్రిటానియా షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఈ లాభాల మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైంని తాకి జోరుమీద ఉన్నాయి.