నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తా!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తానని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఇమ్రాన్ తెలిపాడు. త్వరలోనే పార్లమెంట్ ను మోసం చేస్తున్న నవాజ్ ను సుప్రీంకోర్టు బహిష్కరిస్తుందన్నాడు. షరీఫ్ ప్రభుత్వంతో చర్చల్లో భాగంగా డైలాగ్ కమిటీ ఇచ్చిన ఐదు హామీలను తమ పార్టీ అంగీకరించినా.. అందుకు సంబంధించి రాత పూర్వంగా ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడాన్ని ఇమ్రాన్ తప్పుబట్టారు.
'షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి దింపడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. పీటీఐపై ఆయన పార్లమెంట్ లో అసత్యాలు వల్లిస్తున్నారు. దీనిపై అతన్ని కోర్టుకు లాగుతాం ' అని ఇమ్రాన్ హెచ్చరించాడు. గత కొంతకాలంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే గద్దె దిగిపోవాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్ కేసు విచారణ జరుగుతున్నందున్న పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ నిరసన బాటపట్టారు.