విశ్వరక్షణలో నిస్పృహ వద్దు | In defense of the universe do not want to depression | Sakshi
Sakshi News home page

విశ్వరక్షణలో నిస్పృహ వద్దు

Published Tue, Dec 1 2015 2:49 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

విశ్వరక్షణలో నిస్పృహ వద్దు - Sakshi

విశ్వరక్షణలో నిస్పృహ వద్దు

లీ బౌర్గెట్(ఫ్రాన్స్): భూతాపోన్నతిపై పోరాటంలో భాగంగా చట్టబద్ధమైన సార్వత్రిక, సమగ్ర అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో దాదాపు 150కి పైగా దేశాల ముఖ్య నేతలు పాల్గొంటున్న చరిత్రాత్మక ‘పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21)’ సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రారంభమైంది. కర్బన ఉద్గారాల తగ్గింపు సహా అవసరమైన ఇతర చర్యలు చేపట్టి వాతావరణ మార్పు ప్రతికూల ఫలితాలను అడ్డుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై 12 రోజుల పాటు(డిసెంబర్ 11 వరకు) ప్రపంచ దేశాల అధికార, అనధికార ప్రతినిధులు లోతైన చర్చలు జరపనున్నారు. ఈ సదస్సును ‘ఉగ్రవాదంపై ధిక్కార చర్యగా’ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. యూరప్‌లోను, ఇతర ప్రాంతాల్లోనూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఉగ్రదాడులకు వెరవకుండా ప్రపంచమంతాఐక్యంగా నిలుస్తుందన్న సందేశం  సదస్సుతో పంపిస్తున్నామన్నారు.

‘ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునేవారిని తిరస్కరించేందుకు.. విశ్వరక్షణకు సమస్త శక్తులతో కలిసి కదం తొక్కడాన్ని మించినదేముంటుంద’ని అన్నారు. ఉగ్రదాడి బారిన పడి, 130 మంది ప్రాణాలను కోల్పోయిన రెండు వారాలకే ఈ సదస్సును విజయవంతంగా నిర్వహిస్తుండటంపై పారిస్‌కు, పారిస్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. 150కి పైగా ప్రపంచ దేశాల ముఖ్యనేతలు పాల్గొంటున్న ఈ సదస్సు ప్రారంభలో సోమవారం ఒబామా ప్రసంగించారు. భూతాపోన్నతిని అడ్డుకునేందుకు మనమేం చేయలేమన్న నిస్పృహను వదిలేయాలని నేతలకు పిలుపునిచ్చారు.

సముద్రంలో మునిగిపోతున్న తీరదేశాలు, నిర్మానుష్యంగా మారిన నగరాలు, రోజురోజుకూ తీవ్రమవుతున్న వరదలు, ఇతర విపత్తుల నేపథ్యంలో.. మార్పు సాధ్యమనే ఆశావాదం కలిగి ఉండాలని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవాలని కోరారు. మానవాళికి సురక్షిత భవిష్యత్‌ను అందించేందుకు సమయం ఆసన్నమైందన్నారు. పేద దేశమైనా, ధనిక దేశమైనా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. తాజాగా కుదరనున్న ఒప్పందంలో అన్ని దేశాలకు సమాన బాధ్యత ఉండాలని అమెరికా సహా పలు సంపన్న దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ ఒబామా భేటీ అయ్యారు. వాతావరణ మార్పు విషయంలో ఇరుదేశాల మధ్య సహకారం అత్యంతావశ్యకమన్నారు. భూతాపోన్నతి తగ్గింపునకు ధనిక దేశాలు 2020 నుంచి ప్రతీ ఏటా 100 బిలియన్ డాలర్ల నిధిని సమకూర్చాలన్న వాటి హామీకి కట్టుబడి ఉండాలని చైనా కోరింది.
 
 కొత్త ఆశలకిది సూర్యోదయం!
 సౌరశక్తి దేశాల కూటమిపై మోదీ వ్యాఖ్య

 
 పారిస్: ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ సోమవారం అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమిని ప్రారంభించారు. దీనికి సంబంధించి సెక్రటేరియట్ ఏర్పాటు సహా మౌలిక వసతుల కోసం భూమిని కేటాయిస్తామని, అలాగే, భారత్ తరఫున వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 200 కోట్లు) ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోదీ ప్రకటించారు. కూటమికి సంబంధించిన కార్యక్రమాన్ని త్వరలో హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ’లో నిర్వహిస్తామన్నారు. ‘ఈ రోజు కొత్త ఆశలకు సూర్యోదయం.

స్వచ్ఛ ఇంధనానికి మాత్రమే కాదు.. చీకట్లో మగ్గుతున్న వేలాది గ్రామాలు, గృహాలకు వెలుగులు పంచడానికి ఉద్దేశించిన ఆశలకు సూర్యోదయం’ అని కూటమి ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ వ్యాఖ్యానించారు. 100 పైగా దేశాలు తమ ఆలోచనకు మద్దతిచ్చాయన్నారు.  అన్ని శక్తులకు మూలాధారం సూర్యుడేనని భారతీయులు నమ్ముతారని, జీవులన్నింటి ఆత్మ సూర్యుడేనని రుగ్వేదంలోనూ ఉందని తెలిపారు. సూర్యారాధనతోనే భారతీయులు రోజును ప్రారంభిస్తారన్నారు. మోదీ తలపెట్టిన సౌరశక్తి దేశాల కూటమి ఆలోచన గొప్ప మార్పునకు నాంది అని హోలండ్ కొనియాడారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కూడా ఈ ఆలోచనపై మోదీని ప్రశంసించారు. ఐరాస కూడా అందులో పాలుపంచుకుంటుందన్నారు.
 
 భూతాపోన్నతి అంటే..
 సూర్యరశ్మితో నేల వేడెక్కుతుందన్నది మనకు తెలిసిన విషయమే. మరి భూమి వేడెక్కాలంటే భూమిపై పడే మొత్తం సూర్యరశ్మి అవసరమవుతుందా? ఊహూ! కొంత మొత్తం సరిపోతుంది. మిగిలిన వేడి వాతావరణం గుండా ప్రయాణించి తిరిగి అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. సాధారణంగా జరిగే ఈ ప్రక్రియను గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటారు. అయితే సుమారు 200 ఏళ్ల నుంచి... ఇంకోలా చెప్పాలంటే పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లిపోవాల్సిన వేడిలో కొంత వాతావరణంలోనే ఉండిపోతోంది. కార్బన్‌డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి విషవాయువులు దీనికి కారణమవుతున్నాయి.

పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, పారిశ్రామిక కాలుష్యం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం ద్వారా ఇవి వాతావరణంలోకి చేరుతున్నాయని అంచనా. కాల క్రమంలో వాతావరణంలో వీటి మోతాదు ఎక్కువవుతూ ఉండటంతో భూ వాతావరణం సగటు ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. దీన్నే మనం ‘భూ తాపోన్నతి’ అని పిలుస్తున్నాం! ఈ విష వాయువులన్నింటినీ కార్బన్‌డయాక్సైడ్‌ను ప్రామాణికంగా తీసుకుని లెక్కిస్తున్నారు. మిగిలిన గ్రీన్‌హౌస్ వాయువులను కూడా వాటి మోతాదు, అవి వాతావరణంలో ఉండే సమయాలను కార్బన్‌డయాక్సైడ్‌తో సరిపోల్చి లెక్కగడతారన్నమాట!
 
 400 ప్రస్తుతం వాతావరణంలో ఉన్న సీఓ2 మోతాదు. దీన్ని పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం)లలో కొలుస్తారు. ప్రతి పదిలక్షల
 కణాలకు 400 కణాల సీఓ2 ఉందని అర్థం
 450 పాతికేళ్ల తరువాత వాతావరణంలోని సీఓ2 మోతాదు
  ఏటా వాతావరణంలోకి అదనంగా చేరుతున్న సీఓ2 మోతాదు పీపీఎంలలో 2.1
  సీఓ2 మోతాదులను గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నాలు
 జరక్కపోతే 2040 నాటికి పెరిగే ఉష్ణోగ్రత 2 డిగ్రీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement