అనంత పద్మనాభుడిని మేలుకొల్పేదెలా?
న్యూఢిల్లీ: దేవదేవుడు విష్ణుమూర్తిని ఎలా నిద్రలేపాలనే అనేదానిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాదాపు గంటపాటు వాడీవేడిగా చర్చించింది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించాలా? వద్దా? అనే అంశంపై శనివారం ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. ఆలయ కోశాధికార నిర్వహణ విషయమై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ప్రముఖ లాయర్ కేకే వేణుగోపాల్ ఆలయ ధర్మకర్త అయిన ట్రావెన్కోర్ రాజవంశం తరఫున వాదిస్తుండగా.. అమికస్ క్యూరీగా గోపాల్ సుబ్రహ్మణ్యం కోర్టుకు సహకరిస్తున్నారు.
గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం అనంతపద్మనాభస్వామి ఆలయంలో పఠిస్తున్న సుప్రభాత శ్లోకాన్ని కొనసాగించాలని, ఈ శ్లోకంలో పలుచోట్ల పద్మనాభస్వామి గురించి ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. దీనితో విభేదించిన కేకే వేణుగోపాల్.. విష్ణుమూర్తి ఉన్నది 'యోగనిద్ర'లో అని, ఆయనను సుప్రభాతం పఠించి నిద్రలేపరాదని తెలిపారు. ఇలా సుప్రభాతం పఠించడం వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఆలయ సంప్రదాయాల్లో భాగంకాని ఆచారాలను ప్రవేశపెట్టడం దురదృష్టకరమని, దీని ప్రభావం ఆలయ నిర్వహణ కమిటీపై పడే అవకాశముందని చెప్పారు. ఆయన వాదనలను గోపాల్ సుబ్రహ్మణం వ్యతిరేకించారు. వేంకటేశ్వర సుప్రభాతంలో పద్మనాభస్వామి ప్రస్తావన కూడా ఉందంటూ అందులోని కొన్ని పంక్తులను చదివి వినిపించారు.
అయితే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి కోసమే సుప్రభాతాన్నిపఠిస్తారని, తిరుమలలో వేంకన్న విగ్రహం నిలబడి ఉండగా, పద్మనాభస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకొనే భంగిమలో ఉందని కేకే వేణుగోపాల్ చెప్పారు. ఈ వాదనలు ఆసాంతం విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం 'దేవుడిని ఎలా మేలుకొల్పుతారు, ఇందుకు ఏ పాటను పాడుతారు అన్నది విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ అంశంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు. దీనిని ఆలయ ప్రధాన పూజారి నిర్ణయించనివ్వండి' అని పేర్కొంది. కేరళలోని ఈ ఆలయ నిర్వహణను ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని నేలమాళిగాలను తెరువగా భారీగా సంపద వెలుగులోకి వచ్చింది. రహస్యమైన తొమ్మిదో నేలమాళిగను మాత్రం ఇంకా తెరువలేదు.