మెమన్‌కు ఉరి సరే... మరి బాబ్రీ కేసు?
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్‌ను ఉరి శిక్షను సుప్రీం కోర్టు బుధవారం నాడు ఖరారు చేసింది. ఉరి శిక్ష సబబా, కాదా ? అన్న అంశాన్ని పక్కన పెడితే... ఈ వరుస బాంబు పేలుళ్లకు దారితీసిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసు సంగతేమిటీ? ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణను ఇటు కేంద్రం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద విచారించి శిక్ష వరకు తీసుకెళ్లాయి.
అంతకు దాదాపు మూడు నెలల ముందు, అంటే 1992, డిసెంబర్ 6వ తేదీన జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో విచారణ కూడా కొలిక్కి రాకపోవడానికి కారణం ఏమిటీ? యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చిన వారు, ముఖ్యంగా బీజేపీ, శివసేన కార్యకర్తలు కనీసం బాబ్రీ విధ్వంసం కేసు గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? తమ నేతలే ఆ కేసులో నిందితులుగా ఉండడం వల్లనా!
నేరం ఏదైనా నేరమే. న్యాయం ఎవరికైనా ఒక్కటే కావాలన్నది మన ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి. మన పాలకులకు ఆ స్ఫూర్తి కొరవడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ఏ పార్టీ అతీతం కాదు. కేంద్రంలో అధికారం మారినప్పుడల్లా బాబ్రీ విధ్వంసం కేసులను విచారిస్తున్న సీబీఐ తన వైఖరిని మార్చుకోవడం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాడు జారి చేసిన తప్పుడు నోటిఫికేషన్, పాలకుల జోక్యం కారణాల వల్ల ఈ కేసులు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే చందంగా ఉండిపోయాయి. 2000, అక్టోబర్ నుంచి 2002, మార్చి 8వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న రాజ్‌నాథ్ సింగ్ తప్పుడు నోటిఫికేషన్‌ను సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
బాబ్రీ విధ్వంసానికి సంబంధించి న మోదైన కేసుల్లో ప్రధాన కేసులు రెండు. ఒకటి క్రైమ్ నెం. 197-92, మరొకటి క్రైమ్ నెం. 198-92. మొదటి కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయగా, రెండో కేసులో (198-92) బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ, ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో మంత్రిగావున్న ఉమాభారతి సహా ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అద్వానీపై సీబీఐ భారతీయ శిక్షాస్మృతిలోని 120 (బీ) కింద విచారణ చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా రెచ్చగొట్టే ప్రసంగం మాత్రమే చేశారంటూ ఇతర సెక్షన్ల కింద విచారించి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారు.
ఈ రెండు ప్రధాన కేసుల విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక కోర్టులు ఒకటి, లక్నోలో, మరొకటి రాయ్‌బరేలిలో ఏర్పాటు చేసింది. అద్వానీ, ఉమా భారతి నిందితులుగా ఉన్న 198 క్రైమ్ నెంబర్ కేసును రాయ్ బరేలి కోర్టు నుంచి లక్నో ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కేసును బదిలీ చేసేటప్పుడు హైకోర్టు అనుమతిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ విషయంలో అప్పటి యూపీ ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వం ఈ పొరపాటును సవరించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ సాంకేతిక కారణాల వల్ల కేసు విచారణలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
యూపీలో సమాజ్‌వాది, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కూడా ఈ కేసుల విచారణ ముందుకు సాగలేదు. కీలకమైన బిల్లులకు ఎన్డీయే పక్షాల మద్దతును సేకరించడం కోసం నాటి యూపీఏ ప్రభుత్వం ఈ కేసుల విషయంలో రాజీపడిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సాక్షాత్తు ఎన్డీయేనే కేంద్రంలో అధికారంలోవుంది, సీబీఐని ప్రభావితం చేయగల స్థానంలో కేంద్ర హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ కొనసాగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాబ్రీ విధ్వంసం కేసులు కొలిక్కి వస్తాయన్న నమ్మకం ప్రజాస్వామ్యవాదులకు లేకుండా పోతోంది.