దినకరన్ వర్గానికి షాక్!
ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో తిరుగుబాటు రాజకీయాలను నడుపుతున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై తాజాగా కేంద్ర సంస్థలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దినకరన్ వర్గంలో కీలక నేత, ఇటీవల అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇళ్లపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఆస్తులపై పదిచోట్ల ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
పళనిస్వామి ప్రభుత్వానికి ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకన్ ధనపాల్ ఇటీవల వేటువేసిన సంగతి తెలిసిందే. పళనిస్వామి సర్కారు అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమవుతున్న వేళ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటువేయడంతో తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్పీకర్ అనర్హత వేటు ఉత్తర్వులను తప్పుబడుతూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ ఆదేశాలు వచ్చేవరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మొన్నటివరకు రిసార్ట్‌లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీపై ఐటీశాఖ దాడులు జరపడంతో కేంద్ర సంస్థలు దినకరన్ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు వినిపిస్తోంది.