న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ నిలిచింది. ఈ విషయంలో పొరుగునున్న చైనా, సూపర్‌పవర్ అమెరికాలను కూడా వెనక్కినెట్టింది. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈఅండ్‌వై) నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కాగా, భారత్ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా వరుసగా రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఇక టాప్-10 జాబితాలో కెనడా(4), అమెరికా(5), దక్షిణాఫ్రికా(6), వియత్నాం(7), మయాన్మార్(8), మెక్సికో(9), ఇండోనేసియా(10) స్థానాల్లో నిలిచాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఇటీవల కాలంలో భారీగా సడలించడం, మల్టీబ్రాండ్ రిటైల్ సహా పలు రంగాలకు గేట్లు తెరవడంతో ఇన్వెస్టర్లలో భారత్ పట్ల విశ్వాసం పుంజుకోవడమే ఆకర్షణీయమైన గమ్యంగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. అదేవిధంగా డాలరుతో రూపాయి మారకం విలువ భారీ క్షీణత కూడా ఒక కారణంగా నిలిచింది.