ఐరాస: జనాభాలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. దాదాపు 28.7 కోట్ల మంది భారతీయులకు సరస్వతీ కటాక్షం లేదని పేర్కొంది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని వివరించింది. ఐరాస విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ 2013/14’ నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది.
యునెస్కో నివేదికలో ముఖ్యాంశాలు..
అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 % మంది భారతీయులే.
సంపన్న, పేద భారతీయుల విద్యాస్థాయిల్లో తారతమ్యాలు అధికం.
భారత్‌లో 1991లో అక్షర్యాసత శాతం 48 కాగా 2006 నాటికి ఇది 63కి పెరిగింది.
వృద్ధి చెందుతున్న జనాభా సంఖ్య వల్ల నిరక్షరాస్యులూ పెరుగుతున్నారు.
భారత్‌లో సంపన్న యువతులు అంతర్జాతీయ అక్షరాస్యతా స్థాయిని చేరుకున్నారు. పేదలు మాత్రం వెనకబడే ఉన్నారు.
- అణగారిన వర్గాలు అక్షరాస్యతను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేదంటే ప్రయోజనాలు కొందరికే పరిమితమవుతాయి.
- చదువులపై అంతర్జాతీయంగా ప్రభుత్వాలు ఏటా సుమారు రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
- ప్రాథమిక విద్యపై ప్రపంచ దేశాలు వెచ్చిస్తున్న వ్యయంలో 10 శాతం నాసిరకం విద్యా ప్రమాణాల వల్ల నిరుపయోగంగా మారుతోంది. ఈ - ప్రభావం పేద దేశాలపై పడుతోంది. అక్కడ ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు కనీసం ఒక్క వాక్యం కూడా చదవటంలో విఫలమవుతున్నారు.
- కేరళలో ఒక్కో విద్యార్థిపై ఏటా ప్రభుత్వం రూ.43,000 చదువు కోసం ఖర్చు చేస్తోంది.
- భారత్‌లోని సంపన్న రాష్ట్రాల్లోనూ గణితశాస్త్రంలో పేద బాలికల ప్రదర్శన అట్టడుగు స్థాయిలో ఉంది.
- యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పేదరికం ప్రభావం బాలికలపై అధికంగా ఉంది. ఐదో తరగతి కూడా దాటడం గగనమవుతోంది. ఐదుగురిలో ఒక్క బాలికకు కూడా గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు లేవు.
- అరకొరగా చదివే విద్యార్థులు త్వరగా బడికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
- కొన్ని దేశాల్లో ఉపాధ్యాయ సంఘాల కృషి ఫలితంగా మెరుగైన ఫలితాలు దక్కాయి.
- ఉపాధ్యాయుల గైర్హాజరు కూడా ప్రభావం చూపుతోంది. టీచర్లు తరగతిలో బోధన కంటే ప్రైవేట్‌గా ట్యూషన్లు చెప్పటం తదితర అంశాల వల్ల పేద విద్యార్థుల సామర్థ్యం కుంటుపడుతోంది.