ఆకలి రాజ్యమేలుతోంది
న్యూఢిల్లీ: భారత్ లో ఆకలి కేకలకు కొదవ లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్(జీహెచ్ఐ) 118 అభివద్ధి చెందుతున్న దేశాల మీద చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. ఈ ర్యాకింగ్స్ లో భారత్ 97వ స్ధానంలో నిలిచింది. నైజీరియా, చాడ్, ఇథియోపియా, సియర్రా లియోన్, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల పరిస్ధితి భారత్ కంటే దారుణంగా ఉంది.
శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, నేపాల్ లు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గానే ఉన్నాయి. రెండు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ జీహెచ్ ఐ ఈ నివేదికను తయారుచేసింది. ఒకటి పౌష్టికాహారానికి నోచుకోని జనాభా ఎంత. రెండు ఐదేళ్ల వయసులోపు పిల్లలు మరణాలు, చదువుకునే వారు ఎంత మంది అనే విషయాలను బేస్ గా తీసుకున్నారు.
జీహెచ్ఐ వార్షిక లెక్కలను తయారుచేసే అంతర్జాతీయ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(ఐఎఫ్ పీఆర్ఐ) భారత్ జనాభాలో 15శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. తక్కువ మొత్తంలో మంచి ఆహారాన్ని తీసుకోవలేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. ఐదేళ్లలోపు పిల్లల్లో అయితే పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉందని చెప్పింది. దీని కారణంగానే శిశుమరణాలు, ఎత్తు తక్కువగా ఉండటం లాంటి సమస్యలు భారత్ లో ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
ప్రపంచంలో రెండు అతిపెద్ద పిల్లల పౌష్టికాహార పథకాలను భారత్ అమలు చేస్తున్నా పౌష్టికాహారలోపం భారత్ ను వెంటాడుతూనే ఉందని వ్యాఖ్యానించింది. పేదరికం, నిరుద్యోగం, అపరిశుభ్రత, సురక్షిత తాగునీటీ కొరత, హెల్త్ కేర్ అవసరాలు తీర్చలేకపోవడం లాంటివి భారత్ ను జీహెచ్ఐ ర్యాంకింగ్స్ లో దిగజార్చాయి. అయితే గతంలో కంటే ప్రస్తుత పరిస్ధితి కొద్దిగా మెరుగుపడింది.