'తొలి బుల్లెట్ భారత్ ఎప్పుడూ కాల్చలేదు'
న్యూఢిల్లీ: సరిహద్దు వెంబడి ఉన్న భారత సైన్యం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మొట్టమొదటి బుల్లెట్ పాకిస్థాన్ సైన్యంపైకి కాల్చలేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మున్ముందు కూడా అలా చేయబోదని తెలిపారు. పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిన తర్వాతే భారత్ స్పందించిందని అన్నారు. ఢిల్లీలో సరిహద్దు విభాగానికి చెందిన ఉన్నతాధికారుల సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే.
మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశానికి హాజరైన రాజ్నాథ్ పాక్ సైన్యం చర్యలపట్ల సూటిగా బదులిచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు ఉగ్రవాదుల విషయంలో కూడా స్పష్టమైన సూచనలు పాకిస్థాన్ సైన్యానికి ఇచ్చారు. పాక్ భూభాగం నుంచి ఏ ఒక్క ఉగ్రవాది కూడా భారత భూభాగంలోకి చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పాక్ సైనికులదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు.