
నా కేసు నేనే వాదించుకుంటా
వాషింగ్టన్ : అమెరికాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన ఎన్నారై రఘునందన్ యండమూరి (29) తన కేసు తానే వాదించుకుంటానని చేసుకున్న అభ్యర్థనని పెన్సిల్వేనియా స్టేట్ సుప్రీంకోర్టు జడ్జి అంగీకరించారు. అయితే కోర్టు నిబంధనలకు లోబడి వాదనలు సాగాలని అతడికి జడ్జి సూచించారు. ఈ మేరకు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వీని కిడ్నాప్ చేయడానికి యత్నించి ఆ పసికందును, ఆమె నాయనమ్మ సత్యావతిని దారుణంగా చంపేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యండమూరి రఘునందన్(28)కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన ఈ జంట హత్యలపై రెండేళ్ల విచారణ అనంతరం మాంట్‌గోమెరీ కౌంటీ కోర్టు జ్యూరీ, రఘునందనే ఈ హత్యలు చేశాడని నిర్ధారించింది.
జూదానికి బానిసైన రఘునందన్ భారీగా బకాయిలు పడడంతో, వాటిని తీర్చడానికి చిన్నారి శ్వాన్వీ కిడ్నాప్ ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌నకు అడ్డొచ్చిన చిన్నారి నాయనమ్మ వెన్న సత్యావతి (61)ని కత్తితో పొడిచి, పది నెలల పసికందు వెన్న శాన్వీని ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు రఘునందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
అయితే తొలుత ఈ హత్యలు చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, జరిగిన దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్ ముందు వాగ్మూలం ఇచ్చాడు.
ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్ చెప్పాడు. దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసు బదిలీ అయింది. కేసును మళ్ళీ విచారించిన న్యాయమూర్తులు రఘునందన్ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునే ఈ హత్యలను చేశాడని నిర్థారించారు. దాంతో రఘనందన్‌కు అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది.