రెండున్నర కిలోల బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారతీయుడు బిక్రమ్ కుమార్ను ఖట్మాండ్లోని త్రిభువన్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆ బంగారాన్ని తన బూట్లులో దాచి ఉంచాడు. వీటితోపాటు చేతికి ధరించిన బంగారు బ్రాస్ లెట్కు వెండి కోటింగ్ కొట్టి ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు.
దాంతో అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారం లభ్యమైంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నేపాల్లో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 37.67 కిలోల బంగారాన్ని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నిందితుడు బిక్రమ్ కుమార్ స్వస్థలమని అధికారులు వెల్లడించారు.