తొలగిన తల అతికించారు
లండన్: బ్రిటన్లో భారతీయ సంతతి న్యూరో వైద్యుడు అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేసి రికార్డు సృష్టించారు. యాక్సిడెంట్లో వెన్నెముక నుంచి విడిపోయిన తలభాగాన్ని తిరిగి విజయవంతంగా అమర్చి ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆ బ్రిటన్ యువకుడి తల్లిదండ్రులంతా ఆ వైద్యుడికి ఆనందపరవశంతో కృతజ్ఞతలు తెలిపారు. న్యూకాజిల్ పట్టణానికి చెందిన టోని కోవాన్ అనే యువకుడు గత సెప్టెంబర్ 9న కారు ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళ్లి ఓ టెలిఫోన్ స్థంబానికి కారు గుద్దుకోవడంతో ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయింది.
ఆ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయగా ప్రాణమైతే నిలిచిందిగానీ, వెన్నుకు మాత్రం తీవ్రగాయమైంది. తల భాగం మొత్తం వెన్నుపూస నుంచి పక్కకు జరిగింది. ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించిన అనంత్ కామత్ అనే భారతీయ సంతతి వైద్యుడు ఆపరేషన్కు ముందుకొచ్చి విజయవంతంగా అతడి తలభాగానికి వెన్నెముకకు మెటల్ ప్లేట్ అమర్చి బోల్టులు కూడా బిగించి అరుదైన చికిత్స పూర్తి చేశాడు. దీంతో టోనీ కోవాన్ పూర్తిగా కోలుకొని అతి త్వరలోనే తన ఇంటికెళ్లి సాధారణ వ్యక్తిలా జీవించబోతున్నాడు.