
సేఫ్టీ, స్పీడ్, సెక్యూరిటీ
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్సభలో రైల్వే బడ్జెట్ 2014-15 ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'అన్ని వర్గాలు, ప్రాంతాలకు రైల్వేలు సేవలు అందిస్తున్నాయి. కోల్కతాలో వీధుల మీద నడిచేవారి నుంచి నెల రోజులే అయ్యింది. నాకు అనేక సూచనలు వచ్చాయి. ఎంపీలు, ప్రభుత్వంలో సహచరులు, రాష్ట్రాలు, అన్ని వర్గాలప్రజలు ఈ విషయంలో సలహాలు ఇచ్చారు. రైల్వేలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ తమదైన పరిష్కారాలు సూచించారు. వారి ఆశలు నెరవేర్చేందుకు నా బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నిస్తాను.
ఆర్య చాణక్యుడిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ... ''ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్ నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియంహితమ్.. అంటే, ప్రజల సుఖమే తన సుఖము, ప్రజాహితమే తన హితము. తనకు, ప్రజకు వేరు హితము లేదు'' అని చెప్పారు. 23 మిలియన్ల ప్రయాణికులను మన రైల్వే గమ్యాలకు చేరుస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 7,400 గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. కేవలం 30 శాతం సరుకులనే రైల్వేలు రవాణా చేస్తున్నాయి. రక్షణకు సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా రవాణా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ చాలామంది రైళ్లలో అడుగుపెట్టలేకపోతున్నారని, చాలా ప్రాంతాలు రైళ్ల కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
* సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నాం.
* దేశంలో 1.16 లక్షల కిలోమీటర్ల పట్టాలున్నాయి.
* 13 లక్షల మంది ఉద్యోగులున్నారు.
* భద్రత కూడా మాకు చాలా ముఖ్యం.
* మొత్తం ఖర్చులే 94 శాతం అవుతున్నాయి.
* మాకు వచ్చే ప్రతి రూపాయిలో 94 పైసలు ఖర్చుపెడుతుండగా కేవలం 6 పైసలు మాత్రమే మిగులుతున్నాయి.
* ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, భద్రత.. అన్నీ మాకు ప్రాధాన్యాంశాలే.
* ప్రయాణికుల ఛార్జీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. నష్టాలను పూడ్చేందుకు రవాణా ఛార్జీలను వరుసగా పెంచుకుంటూ వస్తున్నాం.
* సేఫ్టీ, స్పీడ్, సెక్యూరిటీ.. ఈ మూడూ మా ప్రాధాన్యాలు
* 1.57 లక్షల కోట్ల విలువైన 676 ప్రాజెక్టులను గత సంవత్సరం వరకు మనం చేపట్టాం.
* గత పదేళ్లలో 99 ప్రాజెక్టులను చేపట్టగా వాటిలో ఒక్కటి మాత్రమే పూర్తయింది.
* చాలా ప్రాజెక్టులు గత 30 ఏళ్లుగా కొనసా..గుతూనే ఉన్నాయి. ఎక్కువ ప్రాజెక్టులు ఒకేసారి చేపడితే ఇలాగే అవుతుంది.
* గత పదేళ్లలో కొత్త రైలు మార్గాలు వేయడానికి, ఉన్న సింగిల్ లైన్లను డబ్లింగ్ చేయడానికి పెద్దగా ఖర్చుపెట్టలేదు.
* రైల్వే శాఖకు విపరీతంగా నిధుల కొరత ఉండటంతో కమర్షియల్ వయబులిటీ, సామాజిక బాధ్యత మధ్య సమన్వయం చేసుకోలేక గత పదేళ్లుగా చతికిలపడ్డారు.
* గత ప్రభుత్వ విధానాల వల్ల రైల్వేశాఖ నష్టాల్లో కూరుకుపోయింది. ప్రాజెక్టులయితే ప్రకటిస్తున్నాం గానీ, పూర్తి చేయలేకపోతున్నాం.
* 359 పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు కావాలి.
* ఈ ఆర్థిక సంవత్సరంలో 1,64,374 కోట్లు ఆదాయం వస్తుందని భావించి, 1,49,176 కోట్ల వ్యయం ప్రతిపాదిస్తున్నాం.
* ఇటీవల రైల్వే ఛార్జీలను పెంచడం వల్ల 8వేల కోట్ల ఆదాయం వస్తోంది
* భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. ఇందుకు రూ. 11719 కోట్లు వెచ్చిస్తున్నాం
* ప్రస్తుత సంవత్సరంలోనే పూర్తయ్యే ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయిస్తాం
* భద్రత, శుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలు, సామర్థ్యం పెంచడం
* కొన్ని స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తాం
* డోర్ టు డోర్ డెలివరీని కూడా త్వరలోనే భారతీయ రైల్వే చేపడుతుంది.
* రిటర్న్ జర్నీతో బుక్ చేసుకునేవారికి ఆటోమేటిగ్గా చార్జీ తగ్గేలా ఏర్పాటుచేస్తాం
* పార్సిల్ సర్వీసు విషయంలో సరికొత్తడిజైన్లతో పార్సిల్ వ్యాన్లు తయారుచేయించి, వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తాం