కెనడాలో ఎన్నారై యువకుడి ఆత్మహత్య
ఎంత పెద్ద చదువులు చదువుకున్నా.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఏజెంట్ల మాయలో ఇట్టే పడిపోతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలకు లోబడి బోలెడంత డబ్బులు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లడం, తీరా చూస్తే అక్కడ ఉద్యోగాలు రాకపోవడంతో మనస్తాపం చెందడం తప్పట్లేదు. కెనడాలో ఇలాగే ప్రకాశం జిల్లాకు చెందిన పాతపాటి సాయిచంద్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపుపాడుకు చెందిన సాయిచంద్ ఇక్కడే బీటెక్ పూర్తిచేసి, కెనడాలోని టొరంటోలో గల లాంబ్టన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థలో ఎంఎస్ చేయడానికి 2012 ఆగస్టులో వెళ్లాడు. 2013 అక్టోబర్ 10వ తేదీన అతడి భార్య కూడా కెనడా వెళ్లింది. మరొక్క రోజులో చేతికి పట్టా వస్తుందనగా సాయిచంద్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కన్సల్టెన్సీ సంస్థ తనను మోసం చేసిందనే బాధతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయిచంద్కు చంద్రమోహన్ అనే అన్న, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, మహాలక్ష్మి ఉన్నారు. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు సాయిని కెనడా పంపడానికి తమకున్నదంతా ధారపోశారు. దాంతో వారి పరిస్థితి కూడా ఇప్పుడు ఏమాత్రం బాగోలేదని తెలుస్తోంది.