saichand
-
సాయిచంద్ లేని లోటు తీర్చలేనిది
వనస్థలిపురం (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమంలో పాట, మాటలతో తనదైన ముద్ర వేసిన ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువలేదని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మాజీమంత్రి టి.హరీశ్‌రావులు పేర్కొన్నారు. శనివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సాయిచంద్ కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సాయిచంద్ మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ‘‘రాతి బొమ్మల్లోనా కొలువైన శివుడా’’అనే పాట సాయిచంద్ పాడుతుంటే లక్షలాది మంది కన్నీళ్లు పెట్టుకునేవారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో సాయిచంద్ లేని లోటు కనిపించిందని అన్నారు. సాయిచంద్ సతీమణి రజనీ మాట్లాడుతూ..సాయిచంద్ మరణం తర్వాత పార్టీ, ఉద్యమకారులు, కళాకారులు, అభ్యుదయవాదులు, అంబేడ్కర్ వాదులు, పలు సంఘాల నాయకులు తమకు అండగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు రూపొందించిన సాయిచంద్ సంస్మరణ సంచికను కేటీఆర్ విడుదల చేశారు. దేశ్‌పతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నాయకులు బాల్కసుమన్, రసమయి బాలకిషన్, సునీతా లక్ష్మారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాయిచంద్ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థికసాయం
బడంగ్పేట్/అమరచింత: ప్రజా గాయకుడు, దివంగత నేత సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న సాయిచంద్ సతీమణి రజినీకి సోమవారం ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం రజినీతో పాటు చిన్నారులను ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్మన్ తీగల అనిత తదితరులు పాల్గొన్నారు. రజనికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, దాసోజు సాయిచంద్ తండ్రి, చెల్లెలికి చెక్కుల అందజేత అణగారిన వర్గాల బాధలను, ఆంధ్ర పాలకుల నైజాన్ని ఎండగట్టిన మహాగాయకుడు సాయిచంద్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, చెల్లెలు ఉజ్వలకు చెరో రూ.25 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిచంద్, జగదీశ్ కుటుంబాలకు కోటిన్నర చొప్పున సాయం.. కేటీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన భారత్ రాష్ట్ర సమితి యువ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారకరామారావు వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రజల్లో చైతన్యం రగిల్చిన రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సాయిచంద్ (ఫైల్) ఈ యువ నాయకుల కుటుంబాలకు కోటిన్నర రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒకనెల వేతనంతో ఈ సాయం అందించనున్నట్లు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాకు చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, భార్యకు కోటి రూపాయల లెక్కన అందిస్తామని పేర్కొన్నారు. జగదీశ్ (ఫైల్) కాగా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ వేదసాయిచంద్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన భార్య వేద రజనికి అదే సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయిచంద్ కుటుంబాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్కసుమన్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరామర్శించారు. రజనికి రూ.1.5 కోట్ల సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. -
మా భూమి @ 40
ఇండస్ట్రీ కొన్నిసార్లు మూస దారిలో ప్రయాణిస్తుంటుంది... అదే రహదారని భ్రమపడేంత. కొన్నిసార్లు ఆ దారిని ఏమాత్రం లెక్క చేయకుండా.. కొత్త దారుల్ని వెతుక్కుంటూ కొన్ని సినిమాలు వెళ్తాయి. ‘పాత్ బ్రేకింగ్’ సినిమాలంటాం వాటిని. 40 ఏళ్ల క్రితం చేసిన అలాంటి ప్రయత్నమే ‘మా భూమి’. ఫలితం – ప్రభంజనం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మా భూమి’. తెలుగు సినిమాల్లో సంచలనాలను ప్రస్తావించాల్సినప్పుడల్లా ‘మా భూమి’ని నెమరువేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ మళ్లీ గుర్తు చేసుకుందాం. నేటితో ‘మా భూమి’ 40ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి వంద విశేషాలు ఉంటాయి. కానీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమైన 40 విశేషాలు మీకోసం. ► కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఈ సినిమాకు స్ఫూర్తి. ► ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ సలహా మేరకు గౌతమ్ – ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ► దర్శకుడు గౌతమ్ ఘోష్‌కి ఇదే తొలి సినిమా. ► నవల ఆధారంగా గౌతమ్ ఘోష్ ఓ కథను రాసుకొచ్చారు. కానీ నిర్మాతలకు అంతగా నచ్చలేదు. మళ్లీ తెలంగాణాలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఈ కథను రాసుకున్నారు. ► ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. ► ఈ సినిమాను నిర్మించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అందించారు బి. నర్సింగరావు. ► ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఈ సినిమాకు నంది అవార్డులు వరించాయి. ► కార్వే వారీ ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికయిన చిత్రం ‘మా భూమి’. ► సీఎన్ఎన్– ఐబీఎన్ తయారు చేసిన ‘వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల’ జాబితాలో ‘మా భూమి’ చోటు చేసుకుంది. ► ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగాన్ని మెదక్ జిల్లాలోని మంగళ్పర్తిలో చేశారు. అది బి. నరసింగరావుగారి అత్తగారి ఊరే. ► లక్షన్నర బడ్జెట్ అనుకుని మొదలయిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఐదున్నర లక్షలయింది. ► ఈ సినిమాకు గౌతమ్ ఘోష్ భార్య నిలాంజనా ఘోష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ► ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను దర్శకుడు గౌతమే స్వయంగా చూసుకున్నారు. ► పాపులర్ నటి తెలంగాణ శకుంతల ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ► కేవలం ఉదయం ఆటగానే ప్రదర్శించేట్టు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల తర్వాత హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ఏడాది పాటు నిర్విరామంగా ఆడింది. ► ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారి స్క్రీన్ మీద కనిపించిన చిత్రం ఇదే. ► తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి గౌతమ్, నర్సింగరావు తెల్లవారగానే పల్లెలోకి వెళ్లి ఊరిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనిస్తూ ఉండేవారట. ► సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇల్లును కుదవపెట్టారట నర్సింగరావు. ► సినిమాలో ఒక సన్నివేశంలో శవం దగ్గర ఏడ్చే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. సుమారు మూడు నాలుగు ఊర్లు గాలించి పోచమ్మ అనే ఆవిడను తీసుకువచ్చి నటింపజేశారట. ► ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి... పదహారు బళ్లు కట్టి..’ పాట చాలా పాపులర్. మొదట ఈ పాటను నర్సింగరావు మీద తీశారు. రషెష్ చూసుకున్న తర్వాత నా కంటే గద్దర్ మీద చిత్రీకరిస్తే బావుంటుంది అని సూచించారు నర్సింగరావు. ► మా భూమి చిత్రాన్ని మార్చి 23నే విడుదల చేయాలని దర్శక–నిర్మాతల ఆలోచన. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది మార్చి 23వ తేదీనే. ఆ రోజు విడుదల చేస్తే ఆ ముగ్గురికీ నివాళిలా ఉంటుందని భావించారట. ► సినిమా పూర్తయి సెన్సార్‌కి నిర్మాతల జేబులు ఖాళీ అయిపోతే సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్లి ఉంగరాలను తాకట్టుపెట్టి వచ్చిన రూ.700లతో సెన్సార్ జరిపించారు. ► సహజత్వానికి దగ్గరగా ఉండాలని సాయి చంద్ పాత్రకు ఊర్లోని వారి బట్టలను అడిగి తీసుకుని కాస్ట్యూమ్స్‌గా కొన్ని రోజులు వాడారు. ► ఈ సినిమా మొత్తాన్ని మూడు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో పూర్తి చేశారు. ► షూటింగ్స్, సెన్సార్ వంటి అవరోధాలన్నీ దాటినప్పటికీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పంపిణీదారులెవ్వరూ ముందుకు రాలేదు. ఇదేదో రాజకీయ పాఠాలు చెబుతున్న సినిమాలా ఉందని కామెంట్ చేశారట. చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీ తారకరామా ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చేశారు. ► ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన రవీంద్రనాథ్, ఆయన భార్య సినిమా విడుదలైన మూడో రోజు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. కానీ వారికి కూడా టికెట్లు దొరకలేదట. ► ‘చిల్లర దేవుళ్లు’ తర్వాత సినిమా సంభాషణల్లో పూర్తి స్థాయి తెలంగాణ యాసను వాడిన సినిమా ఇదే. ► యూనిట్ దగ్గర ఉన్న కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు గ్రామంలో వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్న పాత బట్టలు తీసుకుని చిత్రీకరణ కోసం వినియోగించేవారట చిత్రబృందం. ► తొలుత ఈ సినిమాకు ‘జైత్రయాత్ర’ అనే టైటిల్‌ని పరిశీలించారట. భూమి కోసం పోరాటం జరుగుతుంది. ‘మన భూమి’ పెడితేనే బావుంటుందని నర్సింగరావు సూచించారట. ► సినిమాలో గడీను ముట్టడి చేసే సన్నివేశాల చిత్రీకరణకు ఆ గ్రామ ప్రజలు సహకరించలేదు. చివరికి వారి అనుమతి లేకుండానే చిత్రబృందం తయారు చేయించుకొని తెచ్చుకున్న తలుపును బద్దల కొట్టినట్టుగా షూట్ చేశారు. ► 1948లో హైదరాబాద్ రాష్ట్రంపై భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన సన్నివేశాలనే సినిమాలో వినియోగించుకున్నారు. ∙పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల గాయాలకే రోజుకో ఐయోడిన్ సీసా ఖాళీ అయ్యేదట. ► చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.. ఇదే తొలి సినిమా. ► దేవీప్రియ ఈ సినిమాకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా పని చేశారు. ► ఈ సినిమాలోని ‘పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడా..’ పాటను సీనియర్ రచయిత సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుతం ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్న సుద్దాల అశోక్ తేజ ఆయన కుమారుడే. ► సినిమా చిత్రీకరిస్తున్న రోజుల్లో యూనిట్ మొత్తం మంగళ్ పర్తిలోనిæ బడిలో నివసించారు. ఆ పక్కనే ఉన్న బావి దగ్గర మగవాళ్లు స్నానాలు చేసేవారు. స్త్రీలేమో ఆ ఊర్లోని సంపన్న కుటుంబీకుల ఇంట్లోని స్నానాల గదులు వాడుకునేవారట. ► ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. ► ఈ సినిమా నెగటివ్ పాడైపోవడంతో 2015 ప్రాంతంలో డిజిటలైజ్ చేసి డీవీడీ విడుదల చేశారు. ‘మాభూమి’ చిత్రంలో సాయిచంద్ సాయిచంద్, రమణి మాభూమి షూటింగ్ సందర్భంగా గద్దర్, దర్శకుడు గౌతమ్, బి.నరసింగరావు, నీలంబన ఘోష్ – గౌతమ్ మల్లాది -
సాయిచంద్‌కు అశ్రునివాళి
సింగరాయకొండ : కెనడాలో ఓ కన్సల్టెన్సీ మోసానికి గురై మనస్తాపం చెంది గత నెల 19వ తేదీన అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి పాతపాటి సాయిచంద్(30) మృతదేహం స్వగ్రామం చినకనుమళ్ల సోమవారం ఉదయం చేరుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ సాయిచంద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుని చితికి తండ్రి లక్ష్మీనారాయణ నిప్పంటించారు. మృతదేహాన్ని చూసేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయిచంద్ భార్య అలేఖ్య కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆమెను ఓదార్చేందుకు ఎవరి వల్లా కాలేదు. తన చితికి కొడుకు నిప్పు పెట్లాల్సి ఉండగా తానే తన కొడుకు చితికి నిప్పు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని తండ్రి లక్ష్మీనారాయణ రోదిస్తుంటే గ్రామస్తులు చలించిపోయారు. తొలుత సాయిచంద్ మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం చేరింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం చినకనుమళ్ల తీసుకొచ్చారు. సాయిచంద్ మృతదేహానికి గ్రామస్తులతో పాటు హెచ్‌పీ గ్యాస్ డీలర్ జి.రంగారెడ్డి, కృష్ణారెడ్డి, కనుమళ్ల ఎంపీటీసీ సభ్యుడు పారా రామకోటయ్య, కనుమళ్ల సహకార సొసైటీ చైర్మన్ భైరపునేని మోహన్‌రావులు నివాళులర్పించారు. -
కెనడాలో ఎన్నారై యువకుడి ఆత్మహత్య
ఎంత పెద్ద చదువులు చదువుకున్నా.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఏజెంట్ల మాయలో ఇట్టే పడిపోతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలకు లోబడి బోలెడంత డబ్బులు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లడం, తీరా చూస్తే అక్కడ ఉద్యోగాలు రాకపోవడంతో మనస్తాపం చెందడం తప్పట్లేదు. కెనడాలో ఇలాగే ప్రకాశం జిల్లాకు చెందిన పాతపాటి సాయిచంద్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపుపాడుకు చెందిన సాయిచంద్ ఇక్కడే బీటెక్ పూర్తిచేసి, కెనడాలోని టొరంటోలో గల లాంబ్టన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థలో ఎంఎస్ చేయడానికి 2012 ఆగస్టులో వెళ్లాడు. 2013 అక్టోబర్ 10వ తేదీన అతడి భార్య కూడా కెనడా వెళ్లింది. మరొక్క రోజులో చేతికి పట్టా వస్తుందనగా సాయిచంద్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కన్సల్టెన్సీ సంస్థ తనను మోసం చేసిందనే బాధతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయిచంద్‌కు చంద్రమోహన్ అనే అన్న, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, మహాలక్ష్మి ఉన్నారు. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు సాయిని కెనడా పంపడానికి తమకున్నదంతా ధారపోశారు. దాంతో వారి పరిస్థితి కూడా ఇప్పుడు ఏమాత్రం బాగోలేదని తెలుస్తోంది.