రజనికి ఆర్థికసాయం సంబంధిత పత్రాలను అందజేస్తున్న బాల్కసుమన్, దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన భారత్ రాష్ట్ర సమితి యువ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారకరామారావు వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రజల్లో చైతన్యం రగిల్చిన రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
సాయిచంద్ (ఫైల్)
ఈ యువ నాయకుల కుటుంబాలకు కోటిన్నర రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒకనెల వేతనంతో ఈ సాయం అందించనున్నట్లు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాకు చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, భార్యకు కోటి రూపాయల లెక్కన అందిస్తామని పేర్కొన్నారు.
జగదీశ్ (ఫైల్)
కాగా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ వేదసాయిచంద్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన భార్య వేద రజనికి అదే సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయిచంద్ కుటుంబాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్కసుమన్, బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరామర్శించారు. రజనికి రూ.1.5 కోట్ల సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment