సాయిచంద్‌కు అశ్రునివాళి
సింగరాయకొండ : కెనడాలో ఓ కన్సల్‌టెన్సీ మోసానికి గురై మనస్తాపం చెంది గత నెల 19వ తేదీన అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి పాతపాటి సాయిచంద్(30) మృతదేహం స్వగ్రామం చినకనుమళ్ల సోమవారం ఉదయం చేరుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ సాయిచంద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుని చితికి తండ్రి లక్ష్మీనారాయణ నిప్పంటించారు. మృతదేహాన్ని చూసేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయిచంద్ భార్య అలేఖ్య కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆమెను ఓదార్చేందుకు ఎవరి వల్లా కాలేదు.
తన చితికి కొడుకు నిప్పు పెట్లాల్సి ఉండగా తానే తన కొడుకు చితికి నిప్పు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని తండ్రి లక్ష్మీనారాయణ రోదిస్తుంటే గ్రామస్తులు చలించిపోయారు. తొలుత సాయిచంద్ మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం చేరింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం చినకనుమళ్ల తీసుకొచ్చారు. సాయిచంద్ మృతదేహానికి గ్రామస్తులతో పాటు హెచ్‌పీ గ్యాస్ డీలర్ జి.రంగారెడ్డి, కృష్ణారెడ్డి, కనుమళ్ల ఎంపీటీసీ సభ్యుడు పారా రామకోటయ్య, కనుమళ్ల సహకార సొసైటీ చైర్మన్ భైరపునేని మోహన్‌రావులు నివాళులర్పించారు.