M.tech student
-
ఆశల దీపం ఆరిపోయింది
ఆనందపురం: ఓ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. గంభీరం రిజర్వాయర్‌లో మునిగి ఓ ఎంటెక్ విద్యార్థి మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమై రోదిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నగరంలోని జడ్జి కోర్టు పక్కన పితాని వీధికి చెందిన బడిగంటి సూర్యప్రకాష్, సీతాలక్ష్మి దంపతులకు బాల సురేంద్ర, భాను శివయశ్వంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సూర్యప్రకాష్ టైలరింగ్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. సీతాలక్ష్మి గృహిణి. బాల సురేంద్ర(24) ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ మొదట సంవత్సరం, భాను శివ యశ్వంత్ డిగ్రీ చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా సురేంద్ర రెండో పూట ఓ రెస్టారెంట్లో రూ.20 వేలు జీతానికి పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి సురేంద్ర, రెస్టారెంట్ యజమాని, మరో ఐదుగురు స్నేహితులు జీపులో బయలుదేరారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో గంభీరం రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కొంత సేపు కాలక్షేపం చేసి అందరూ గంభీరం రిజర్వాయర్‌లోకి ఈతకు దిగారు. గతంలో రిజర్వాయర్ గర్భంలోని మట్టిని తరలించగా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. అవి ఊబిగా మారాయి. ఈతకు దిగిన వారిలో బాల సురేంద్ర మునిగిపోయాడు. అతను ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు కేకలు వేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులతో పాటు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సీఐ రామచంద్రరావు, ఎస్ఐలు శ్యామ్‌సుందర్, నరిసింహమూర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లను తీసుకొని వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం బాల సురేంద్ర మృతదేహం ఊబిలో కూరుకుపోయి ఉండడాన్ని గుర్తించి బయటకు తీశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ నర్సింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
పటాన్చెరు టౌన్ (మెదక్) : ఎంటెక్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని ఓ లాడ్జిలో మంగళవారం వెలుగుచూసింది. పటాన్చెరు సీఐ లింగేశ్వర్, స్థానికుల కథనం ప్రకారం... ఎన్.ఉదయభాస్కర్(23) రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇతను తల్లిదండ్రులతో కలిసి ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. కాగా ఉదయ భాస్కర్‌తోపాటు ఆరుగురు స్నేహితులు సోమవారం రాత్రి ముత్తంగి సమీపంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. స్నేహితులంతా తెల్లారేసరికి లాడ్జి గది నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం లాడ్జి సిబ్బంది వెళ్లి చూడగా బెడ్‌పై ఉదయభాస్కర్ విగతజీవిగా పడి ఉన్నాడు. గదిలో విషం డబ్బా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అతని జేబులో బంగారం తాకట్టు పెట్టిన రశీదు లభించింది. సోమవారం రాత్రి గదికి వచ్చిన వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే వారిలో అనిల్‌కుమార్ అనే యువకుడు పరారీలో ఉన్నారు. ఉదయభాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా విషప్రయోగం చేశారా? అన్న కారణాలు తెలియాల్సి ఉంది. ఇతను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. లాడ్జిలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ్ణ వరప్రసాద్ చిట్కుల్లోని జీటీఎన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. -
ఎంటెక్ విద్యార్థినిపై డీఎస్పీ భార్య దాడి
- ఐడీ కార్డు చూపుతూ రోడ్డుపై వీరంగం వరంగల్ క్రైం : ఓ డీఎస్పీ భార్య ఎంటెక్ విద్యార్ధినిని నడిరోడ్డుపై చితకబాదిన సంఘటన సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరుగగా బాధితురాలు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. సుబేదారి పోలీసులు, బాధితురాలు సింధూజ తండ్రి చిట్టిమల్ల విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం..సింధూజ అనే ఎంటెక్ విద్యార్థిని టీచర్స్‌కాలనీలో ఉంటోంది. సింధూజ చెల్లెలు సిరి వడ్డేపల్లిలోని రెడ్డి సంక్షేమ సంఘం సమీపంలో ఉన్న ఎస్సార్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సింధూజ కూడా అన్నసాగర్ ఎస్సార్ కళాశాలలో బిటెక్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో సింధూజ తన చెల్లెలను కళాశాల నుంచి తీసుకువెళ్లడానికి వచ్చింది. రోడ్డు పక్కన తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది. అటుగా డస్టర్ వాహనంలో వస్తున్న ఓ డీఎస్పీ సతీమణి వాహనాన్ని కొద్దిగా సింధూజ వాహనం అడ్డుగా నిలిచింది. అయినా వెంటనే తన టూ వీలర్‌ను పక్కకు జరుపడంతో వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిగా ముందుకు వెళ్లిన డీఎస్పీ భార్య వాహనాన్ని నిలిపి వచ్చి నేను డీఎస్పీ భార్యను నా వాహనానికే అడ్డువస్తావా అంటూ పరుషపదజాలంతో దూషించింది. అంతటితో ఆగకుండా తన భర్త ఐడి కార్డు చూపుతూ దాడికి దిగింది. షూ ధరించి ఉన్న సదరు డిఎస్పీ భార్య సింధూజను కాళ్లపై, చేతులపై ఇష్టం వచ్చినట్లు తన్ని సిరి వద్ద ఉన్న పుస్తకాల బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయింది. రోడ్డుపై నిలిచిన వారు ఆపడానికి ప్రయత్నిస్తున్నా సైకోలా ప్రవర్తించిందని, సదరు మహిళను కఠినంగా శిక్షించాలని విద్యాసాగర్ తెలిపారు. ఈ మేరకు విద్యాసాగర్ తన కూతుళ్లతో కలిసి సుబేదారి పోలీస్‌స్టేషన్ చేరుకుని సీఐ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు. -
సాయిచంద్‌కు అశ్రునివాళి
సింగరాయకొండ : కెనడాలో ఓ కన్సల్టెన్సీ మోసానికి గురై మనస్తాపం చెంది గత నెల 19వ తేదీన అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి పాతపాటి సాయిచంద్(30) మృతదేహం స్వగ్రామం చినకనుమళ్ల సోమవారం ఉదయం చేరుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ సాయిచంద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుని చితికి తండ్రి లక్ష్మీనారాయణ నిప్పంటించారు. మృతదేహాన్ని చూసేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయిచంద్ భార్య అలేఖ్య కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆమెను ఓదార్చేందుకు ఎవరి వల్లా కాలేదు. తన చితికి కొడుకు నిప్పు పెట్లాల్సి ఉండగా తానే తన కొడుకు చితికి నిప్పు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని తండ్రి లక్ష్మీనారాయణ రోదిస్తుంటే గ్రామస్తులు చలించిపోయారు. తొలుత సాయిచంద్ మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం చేరింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం చినకనుమళ్ల తీసుకొచ్చారు. సాయిచంద్ మృతదేహానికి గ్రామస్తులతో పాటు హెచ్‌పీ గ్యాస్ డీలర్ జి.రంగారెడ్డి, కృష్ణారెడ్డి, కనుమళ్ల ఎంపీటీసీ సభ్యుడు పారా రామకోటయ్య, కనుమళ్ల సహకార సొసైటీ చైర్మన్ భైరపునేని మోహన్‌రావులు నివాళులర్పించారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కడప రిమ్స్‌కు తరలింపు వేంపల్లె, న్యూస్‌లైన్ : ఆర్.కె.వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ విద్యార్థి ఆదిత్య ఆదివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అతనిని కడప రిమ్స్‌కు తరలించారు. నూజివీడు క్యాంపస్‌కు సంబంధించి ఆరుగురు ఎంటెక్ విద్యార్థులు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు వర్క్ చేసేం దుకు 6నెలల క్రితం వచ్చారు. వీరిలో ఆదిత్య కూడా ఒకరు. వీరి ప్రాజెక్టు వర్క్ శనివారం నాటికే పూర్తయింది. ఆదివారం వారి గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. గుంటూరు జిల్లా చీరాలకు చెందిన ఆదిత్య ప్రాజెక్టు వర్క్‌లో తక్కువ మార్కులు వస్తాయన్న అనుమానంతో ఫ్యానుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొత్త క్యాంపస్‌లోని 63వ గదిలో సాయంత్రం బట్టలు ఆరేసుకునే వైరును తీసుకొని ఫ్యానుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించారు. పక్కనున్న విద్యార్థులు గమనించి ఆదిత్యను కాపాడగలిగారు. ఇడుపులపాయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థి నూజివీడు క్యాంపస్‌కు చెందినవారని.. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. ఎటువంటి ప్రాణాపాయంలేదని తెలిపారు.