ఎంటెక్ విద్యార్థినిపై డీఎస్పీ భార్య దాడి
- ఐడీ కార్డు చూపుతూ రోడ్డుపై వీరంగం
వరంగల్ క్రైం : ఓ డీఎస్పీ భార్య ఎంటెక్ విద్యార్ధినిని నడిరోడ్డుపై చితకబాదిన సంఘటన సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరుగగా బాధితురాలు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. సుబేదారి పోలీసులు, బాధితురాలు సింధూజ తండ్రి చిట్టిమల్ల విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం..సింధూజ అనే ఎంటెక్ విద్యార్థిని టీచర్స్‌కాలనీలో ఉంటోంది. సింధూజ చెల్లెలు సిరి వడ్డేపల్లిలోని రెడ్డి సంక్షేమ సంఘం సమీపంలో ఉన్న ఎస్సార్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సింధూజ కూడా అన్నసాగర్ ఎస్సార్ కళాశాలలో బిటెక్ చదువుతోంది.
సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో సింధూజ తన చెల్లెలను కళాశాల నుంచి తీసుకువెళ్లడానికి వచ్చింది. రోడ్డు పక్కన తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది. అటుగా డస్టర్ వాహనంలో వస్తున్న ఓ డీఎస్పీ సతీమణి వాహనాన్ని కొద్దిగా సింధూజ వాహనం అడ్డుగా నిలిచింది. అయినా వెంటనే తన టూ వీలర్‌ను పక్కకు జరుపడంతో వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిగా ముందుకు వెళ్లిన డీఎస్పీ భార్య వాహనాన్ని నిలిపి వచ్చి నేను డీఎస్పీ భార్యను నా వాహనానికే అడ్డువస్తావా అంటూ పరుషపదజాలంతో దూషించింది. అంతటితో ఆగకుండా తన భర్త ఐడి కార్డు చూపుతూ దాడికి దిగింది.
షూ ధరించి ఉన్న సదరు డిఎస్పీ భార్య సింధూజను కాళ్లపై, చేతులపై ఇష్టం వచ్చినట్లు తన్ని సిరి వద్ద ఉన్న పుస్తకాల బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయింది. రోడ్డుపై నిలిచిన వారు ఆపడానికి ప్రయత్నిస్తున్నా సైకోలా ప్రవర్తించిందని, సదరు మహిళను కఠినంగా శిక్షించాలని విద్యాసాగర్ తెలిపారు. ఈ మేరకు విద్యాసాగర్ తన కూతుళ్లతో కలిసి సుబేదారి పోలీస్‌స్టేషన్ చేరుకుని సీఐ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు.