ఉద్యమ గాయకుడు సాయిచంద్ వర్ధంతి సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు
వనస్థలిపురం (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమంలో పాట, మాటలతో తనదైన ముద్ర వేసిన ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువలేదని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మాజీమంత్రి టి.హరీశ్‌రావులు పేర్కొన్నారు. శనివారం హస్తినాపురంలోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సాయిచంద్ కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సాయిచంద్ మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ‘‘రాతి బొమ్మల్లోనా కొలువైన శివుడా’’అనే పాట సాయిచంద్ పాడుతుంటే లక్షలాది మంది కన్నీళ్లు పెట్టుకునేవారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో సాయిచంద్ లేని లోటు కనిపించిందని అన్నారు.
సాయిచంద్ సతీమణి రజనీ మాట్లాడుతూ..సాయిచంద్ మరణం తర్వాత పార్టీ, ఉద్యమకారులు, కళాకారులు, అభ్యుదయవాదులు, అంబేడ్కర్ వాదులు, పలు సంఘాల నాయకులు తమకు అండగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు రూపొందించిన సాయిచంద్ సంస్మరణ సంచికను కేటీఆర్ విడుదల చేశారు.
దేశ్‌పతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నాయకులు బాల్కసుమన్, రసమయి బాలకిషన్, సునీతా లక్ష్మారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment