మార్కెట్లకు నేడు సెలవు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మే 1, సోమవారం మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పని చేయవు. మళ్లీ ట్రేడింగ్ 2వతేదీ మంగళవారం ఉదయం యథావిధిగా మొదలవుతుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం.
గత వారం సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయి అధిగమించగా, నిఫ్టీ సైతం మొట్టమొదటిసారి 9,350 అధిగమించి ఆల్ టైం హైని రికార్డ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గరిష్ట స్థాయిలను నమోదు చేయడం విశేషం. శుక్రవారం సెన్సెక్స్ 29,918 వద్ద, నిఫ్టీ 9,304 వద‍్ద ముగిశాయి. డాలర్ మారకంలో రుపీ కూడా చాలా బలంగా కొనసాగుతోంది. ఒకదశలో 64 స్థాయిని బ్రేక్ చేసిన రుపాయి గత సెషన్ లో రూ.64.24వద్ద స్థిరపడింది.
కాగా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రతికూల సంకేతాలతో లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రన్ ముందున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్ లభించిన సంగతి విదితమే.