మనం సంతోషంగా లేం! | Indians are not happy | Sakshi
Sakshi News home page

మనం సంతోషంగా లేం!

Published Sat, Apr 25 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

మనం సంతోషంగా లేం!

మనం సంతోషంగా లేం!

సంతోష దేశాల జాబితాలో 117వ స్థానంలో భారత్
అత్యంత సంతోషంగా ఉన్న దేశం స్విట్జర్లాండ్
 
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 117వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి మొత్తం 158 దేశాల్లో ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), అవినీతి, జీవితకాలం, కష్టాల్లో ఉన్నప్పుడు దొరికే సామాజిక మద్దతు, స్వేచ్ఛా నిర్ణయాలు, ఔదార్యం తదితర అంశాల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఇందులో 2015కు గాను అత్యంత ఆనందంగా ఉన్న దేశంగా స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
 
 టాప్ 10లో ఐస్‌లాండ్, డెన్మార్క్, నార్వే, కెనడా, ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ప్రపంచ సంతోష నివేదిక పేరుతో ఐరాసకు చెందిన సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్ (ఎస్‌డీఎస్‌ఎన్) సంతోష దేశాల జాబితాను ప్రచురించింది. ఇందులో భారత్ స్థానం పాకిస్తాన్ (81), పాలస్తీనా (108), బంగ్లాదేశ్ (109), ఉక్రెయిన్ (111), ఇరాక్ (112) కంటే దిగువన ఉండటం గమనార్హం. 2013లో 111వ స్థానంలో భారత్ తాజా జాబితాలో మరో 6 స్థానాలు పడిపోయి 117లో నిలిచింది. అమెరికా 15వ ర్యాంక్‌లో ఉండగా, తర్వాత బ్రిటన్ (21), సింగపూర్ (24), సౌదీ అరేబియా (35), జపాన్ (46), చైనా (86) ఉన్నాయి.
 
 అత్యంత తక్కువ సంతోషంగా 10 దేశాల్లో అఫ్ఘానిస్తాన్, సిరియాతోపాటు ఆఫ్రికాలోని టొగో, బురుండీ, బెనిన్, రాండా, బుర్కినా ఫాసో, ఐవరీ కోస్ట్, గినియా, చాడ్ ఉన్నాయి. కాగా, ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు 18 ఏళ్ల వయసులోపు ఉన్నారని ఐరాస తెలిపింది. పిల్లల అభివృద్ధిలో విద్య, ప్రవర్తన, ఉద్వేగం అనే మూడు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది పిల్లలు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, వీరిలో కేవలం నాలుగోవంతు మాత్రమే చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement