పసిడి డిమాండ్‌కు స్మగ్లింగ్‌ గండి | India's 2016 gold demand likely to fall to 7-year low thanks to smuggling | Sakshi
Sakshi News home page

భారత్ లో పసిడి డిమాండ్ పడిపోతోందా?

Published Tue, Nov 8 2016 2:42 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

పసిడి డిమాండ్‌కు స్మగ్లింగ్‌  గండి - Sakshi

పసిడి డిమాండ్‌కు స్మగ్లింగ్‌ గండి

న్యూఢిల్లీ: భారతదేశంలో పసిడికి డిమాండ్‌ 2016 సంవత్సరంలో  24శాతం పడిపోనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రభుత్వం  బంగారం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడం,  అధిక ధరలతోపాటు, దేశంలోకి  పెరిగిన అక్రమ రవాణా కారణంగా డిమాండ్‌​ గణనీయంగా పడిపోతోందని మంగళవారం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. గడచిన మొదటి మూడు త్రైమాసికాల్లో 29 శాతం క్షీణించిన పసిడి డిమాండ్‌ ఏడు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరనుందని తెలిపింది.


ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ లో ఈ సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో 441.2 టన్నుల బంగారం దిగుమతి అయిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువని డబ్ల్యూజీసీ ఇండియా ఆపరేషన్స్ ఎండీ పీఆర్ సోమసుందరమ్ వెల్లడించారు. గత సంవత్సరం 858.1 టన్నుల బంగారం దిగుమతి అయిందన్నారు. 2009 తరువాత ఈస్థాయిలో  డిమాండ్ పడిపోవడం ఈ ఏడాదే చూస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది  దిగుమతులు 650 నుంచి 750 టన్నుల వరకూ  నమోదు కావచ్చని అంచనా వేశారు. వివిధ దేశాల నుంచి స్మగ్లింగ్ రూపంలో బంగారం తెస్తున్న అక్రమార్కులు దాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని   డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

అయితే దీపావళికి ముందు బంగారం ధరలు దిగారావడం, మంచి వర్షపాత అంచనాలు కారణంగా మొదటి మూడు త్రైమాసికాల్లో పోలిస్తే నాలుగవ  త్రైమాసికం కొంచెం మెరుగ్గా వుండొచ్చని ఆయన అంచనావేశారు. అలాగే దేశంలో బంగారం విక్రయాల్లో మూడవ వంతు వాటా గ్రామాలదేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement