
డాలరు జోరు మెడికల్ టూరు
- కలిసి వస్తున్న కరెన్సీ పతనం
- భారత్‌కి పెరుగుతున్న విదేశీ పేషెంట్లు
- చికిత్స వ్యయాలు మరింత తగ్గుతుండటమే కారణం
కరెన్సీ పతనం కష్టాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎగుమతి కంపెనీలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి బాగానే కలిసి వస్తోంది. విదేశీయులకు ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఇప్పటికే చౌకగా వైద్యం లభిస్తుండగా... రూపాయి క్షీ ణతతో చికిత్స ఖర్చులు మరింత తగ్గుతున్నాయి. దీంతో, చికిత్స కోసం వ చ్చే విదేశీయుల సంఖ్య ఈసారి 30% దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. చౌకగా వైద్య సేవలు అందించడంలో సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో భారత్ పోటీపడుతోంది.
సంపన్న దేశాల్లో అయ్యే వైద్య ఖర్చులతో పోలిస్తే మన దగ్గర నాలుగు నుంచి పదో వంతు ఖర్చుతోనే చికిత్స పూర్తయిపోతోంది. పెపైచ్చు మెడికల్ టూరిజంలో ఆకట్టుకుంటున్న ఇతర దేశాలలకు భారత్‌లో చికిత్స వ్యయాలకు మధ్య ఇప్పటిదాకా 20-25% వ్యత్యాసం ఉండేది. తాజాగా రూపాయి పతనంతో ఈ వ్యత్యాసం 30-35 శాతానికి పెరిగింది. డాలర్‌తో పోలిస్తే కొరియా కరెన్సీ వాన్ ఈ ఏడాది ఇప్పటిదాకా నాలుగు శాతం, ఫిలిప్పీన్స్ పెసో సుమారు 6%, థాయ్ బాహ్త్ దాదాపు మూడు శాతం మాత్రమే పతనమైతే.. భారత రూపాయి మారకం మాత్రం 18 శాతం పైచిలుకు క్షీణించింది. దీంతో.. గతంలో 8,000 డాలర్ల దాకా వ్యయమయ్యే చికిత్స ప్రస్తుతం రూపాయి పతనం కారణంగా 7,000 డాలర్లకే అందుబాటులోకి వస్తోందని ‘మెడాంటా మెడిసిటీ’ వర్గాలు తెలిపాయి. విదేశీయులకు తక్కువ వ్యయం అవుతుండటంతో కొన్నేళ్లుగా 20-22 శాతం మేర వృద్ధి చెందుతున్న వైద్య రంగం... రూపాయి పతనం కారణంగా ఈసారి 25-30 శాతం మేర వృద్ధి నమోదు చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చికిత్స వ్యయాలు ఇలా: కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ 2011లో రూపొందించిన నివేదిక ప్రకారం.. అమెరికా లో కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీకి 70,000 డాలర్ల నుంచి 1,33,000 డాలర్ల దాకా ఖర్చయితే.. భారత్‌లో కేవలం 7,000 డాలర్లలో పూర్తయిపోతోంది. దక్షిణ కొరి యాలో ఈ వ్యయం 31,750 డాలర్లు, థాయ్‌లాండ్‌లో 22,000 డాలర్లుగా ఉంది. అలాగే, మోకాలి చిప్ప రిప్లేస్‌మెంట్‌కి అమెరికాలో 30,000-53,000 డాలర్ల దాకా ఖర్చవుతుంటే.. భారత్‌లో 9,200 డాలర్లే అవుతోంది. ఇదే సర్జరీకి దక్షిణ కొరి యాలో 11,800 డాలర్లు, థాయ్‌లాండ్‌లో 11,500 డాలర్లు అవసరమవుతాయి.
అమెరికన్లపై దృష్టి: అపోలో హాస్పిటల్స్ వంటి పెద్ద ఆస్పత్రులకు వచ్చే విదేశీ పేషంట్లలో సార్క్ దేశాల నుంచి 36 శాతం మంది, ఆఫ్రికా నుంచి 26 శాతం, పశ్చిమాసియా నుంచి 26 శాతం, అమెరికా.. యూరప్‌ల నుంచి చెరి మూడు శాతం మంది ఉంటున్నారు. ఈసారి వీరి సంఖ్య మరింతగా పెరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ఫోర్టిస్ హెల్త్‌కేర్ గ్రూప్‌కి వచ్చే విదేశీ పేషెంట్ల సంఖ్య గత రెండేళ్ల దాకా 20-25 శాతం ఉండగా... రూపాయి క్షీణత ప్రభావంతో ఈసారి 28-30 శాతానికి కూడా పెరగొచ్చని అంచనా. ప్రధానంగా మాత్రం అమెరికా నుంచి వచ్చే వారిపైనే ఈ ఆసుపత్రులు దృష్టిపెడుతున్నాయి. రెండేళ్ల కిందటిదాకా వైద్య చికిత్స కోసం ఇతర దేశాలకు వెళ్లే అమెరికన్ల సంఖ్య 85,000 పైచిలుకు ఉంటే.. ఇందులో చాలా తక్కువ మంది భారత్ వచ్చేవారు. అయితే, ఇప్పుడు విదేశాలకు వెళ్లే అమెరికన్ల సంఖ్య 20 లక్షల పైచిలుకు ఉంటోందని, చికిత్స ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు నాణ్యమైన వైద్యం అందుతున్న నేపథ్యంలో వీరిలో చాలా మంది భారత్‌కి రావొచ్చని అంచనా వేస్తున్నారు. చాలా మంది భారతీయ డాక్టర్లు అమెరికాలో శిక్షణ పొందడం, అక్కడివారితో పరిచయాలు ఉండటం కూడా అమెరికన్లు భారత్ వైపు మొగ్గుచూపడానికి కారణంగా నిలవగలదని భావిస్తున్నారు.
భారీ అవకాశాలు: అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గతేడాది దాదాపు పది లక్షల విదేశీ పేషంట్లు భారత్ వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం మార్కెట్ సుమారు 100 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. ఇందులో భారత్ వాటా మూడు శాతం. వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావటంతో... కరెన్సీ క్షీణత ఈ వాటాను మరింత పెంచేందుకు దోహదపడవచ్చనేది విశ్లేషకుల భావన.
అడ్డంకులూ ఉన్నాయి: పెద్ద సంఖ్యలో విదేశీ పేషెంట్లు వచ్చే అవకాశాలున్నప్పటికీ కొన్ని అడ్డంకులు ఉంటున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. విదేశీయులకు చికిత్స అందించే ఖరీదైన ఆస్పత్రుల్లో సీనియర్ డాక్టర్లకు జీతభత్యాలు భారీగానే ఉంటున్నా.. నర్సులు తదితర సిబ్బందికి మాత్రం అరకొర వేతనాలే ఉంటున్నాయి. పైగా పనిగంటలు కూడా ఎక్కువగా ఉండటం మొదలైన కారణాలు వారిలో నిరాసక్తతకు దారితీస్తున్నాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు దీన్నిసరిదిద్దితే మరింత మంది పేషెంట్లు రావడానికి ఆస్కారం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రుల లోపల మౌలిక వసతులు బాగానే ఉంటున్నా..అక్కడిదాకా రావాలంటే మిగతా మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండటం లేదని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.