పరిశ్రమలతోనే సమాజాభివృద్ధి
* కార్మికుల రక్షణకు చర్యలు
* హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లోని కార్మికుల ప్రాణ రక్షణకు తగు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్యాక్టరీస్, జాతీయ భద్రతా కౌన్సిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో 45వ నేషనల్ సెఫ్టీ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ప్రగతితోనే సమాజం బాగుపడుతుందన్నారు. నిరుద్యోగ సమస్య ఉండదని.. నక్సలిజం లాంటి సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు.
బయటి రాష్ట్రాల నుంచి కార్మికులు ఉపాధి కోసం వచ్చి ఇక్కడ పరిశ్రమల్లో చేరుతున్నారని.. అయితే వారికి సరైన శిక్షణ లేక ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇలాంటి వారి కోసం ఓ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నాయిని చెప్పారు. తనిఖీల పేరుతో అధికారుల జేబు నిండే కార్యక్రమానికి చెక్ పెట్టేందుకు, కార్మిక సంఘాల నేతలు, అధికారులతో కలిపి పరిశ్రమల తనిఖీ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్యాక్టరీస్ ఆధ్వర్యంలో నాయినిని ఘనంగా సత్కరించారు. పలువురికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఎంప్లాయ్‌మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రిత్ సింగ్, నేషనల్ సెఫ్టీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎల్‌ఎన్ మూర్తి, ఎంబీ విజయ్‌కుమార్, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీహెచ్ కిషన్, కనీస వేతనాల చట్టం సలహామండలి చైర్మన్ సదానంద గౌడ్, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టి. చంద్రశేఖర్, ఐఎన్‌టీయూసీ నేత ఆర్‌బీ చంద్రశేఖర్, బీఎంఎస్ నేత మల్లేశం, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
సార్ కంట్రోల్... ప్రసంగం తగ్గించండి
కార్మికులన్నా, పరిశ్రమలన్నా... హోంమంత్రి తనను తాను మరిచిపోతారు. అదీ బాస్ కేసీఆర్ పేరును ఉటంకిస్తూ ఏవేవో అనేస్తారు. రవీంద్రభారతిలోనూ ఇదే జరిగింది. నగర సమీపంలోని కొన్ని పరిశ్రమలు అతి దారుణంగా వ్యవహరిస్తున్నాయని, దౌర్జన్యాలు, అన్యాయాలు సాగిస్తున్నాయని, వాటిని దేవుడే బాగు చేయాలని, తనకు మాత్రం ఛాన్స్ దొరికితే వాటిని గాడిలో పెట్టాలని ఉందన్నారు. సీఎం కేసీఆర్ పరిశ్రమల జోలికి వెళ్లొద్దని అంటున్నారని నర్మగర్భంగా పలు విషయాలు మాట్లాడేశారు. పక్కనే ఉండి ఇది గ మనించిన హర్‌ప్రీత్‌సింగ్.. సార్ ప్రసంగం తగ్గించండి, కంట్రోల్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో నాయిని అర్థం చేసుకుని కొంత శాంతించారు.