
విఠలాచార్యను సత్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చిత్రంలో హోంమంత్రి మహమూద్ అలీ, సిధారెడ్డి, రమణాచారి, హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతి వేడుకలు సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో కనులపండువగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖ సాహితీవేత్త, ఈ తరం వట్టికోటగా పేరొందిన కూరెళ్ల విఠలాచార్యకు ప్రతిష్టాత్మకమైన దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేశారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలంలోని తన స్వగ్రామం వెల్లంకిలో 80 వేలకుపైగా పుస్తకాలతో మహాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన కూరెళ్ల సాహితీసేవలను వక్తలు కొనియాడారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దాశరథి సాహిత్యం నిజాం కాలం నుంచి నేటివరకు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఆయన చేసిన కవితాగానం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమనినాదమై ఉత్తేజితం చేసిందన్నారు. కోటి రతనాల వీణ అయిన తెలంగాణలో కోటి ఎకరాల మాగాణాన్ని సస్యశామలం చేసే బృహత్తరకార్యాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణతల్లి బాధలను, కష్టాలను తీర్చే ఎదిగివచ్చిన కొడుకుగా దాశరథి కృష్ణమాచార్య ఉద్య మసాహిత్యాన్ని అందజేశారని కొనియాడారు.
పల్లెపట్టుకే ఈ పురస్కారం అంకితం: దాశరథి పురస్కారాన్ని అందుకున్న విఠలాచార్య ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ పురస్కారాన్ని పల్లెపట్టుకే అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి రూ.లక్షా 16 వేల నగదు, వెండి మయూరి జ్ఞాపికను కూరెళ్లకు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, నందిని సిధారెడ్డి, బి.శివకుమార్, దాశరథి తనయుడు లక్ష్మణ్, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment