cultural activites
-
ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్ సతీమణికి నాగాలాండ్‌లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్ పెయింటింగ్స్‌ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్కు ఛత్తీస్‌గఢ్ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు. -
15, 16 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్ : దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది. ‘భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్’ అంశంపై ఈనెల 15, 16 తేదీ ల్లో హైదరాబాద్‌లో మొదటి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొం ది. మ్యూజియంలు ఆడియో–విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించి, డాక్యుమెంట్ రూపంలో భద్రపరచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయని వివరించింది. సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపింది. -
‘ము పట్టొ పొడిబి’.. దీనికి అర్థం ఏంటో తెలుసా?
బరంపురం(భువనేశ్వర్): నగరంలోని హిల్‌పట్నా మెయిన్‌రోడ్డులో ఉన్న బిజూ పట్నాయక్ సాంస్కృతిక భవనంలో ఒడిశా నాటక సమారోహ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిశు నాటక మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా గంజాం జిల్లా బంజనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు చేపట్టిన ‘ము పట్టొ పొడిబి’(నేను చదువుకుంటాను) అనే నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు, ఎమ్మెల్యే విక్రమ్ పండా తదితరులు పాల్గొన్నారు. మరో ఘటనలో.. రాఖీ ఘెష్‌కు ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం భువనేశ్వర్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం–2021..ది పయనీర్ ఇంగ్లిష్ జర్నలిస్ట్ రాఖీ ఘోష్‌ని వరించింది. వర్చువల్ మాధ్యమంలో ఈ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. సుందరగఢ్ ప్రాంతంలో కోవిడ్ మృతుల దహన సంస్కారాలను స్వచ్చంధంగా నిర్వహిస్తున్న యుజవన సాంఘిక సేవా సంస్థలపై పత్రికలో రాసిన కథనానికి గాను ఆమెకి ఈ అవార్డుల లభించినట్లు తెలుస్తోంది. చదవండి: భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి -
భారత–చైనా బంధంలో కొత్త మలుపు
గత ఏడు దశాబ్దాలుగా ‘గొప్ప ముందడుగు’ ‘సాంస్కృతిక విప్లవం’, ‘వినియోగదారీ సంస్కృతి’ అనే దశలగుండా ప్రయాణిస్తూ వచ్చిన చైనా నేడు అత్యంత బలసంపన్నమైన జాతిగా ఆవిర్భవించింది. కానీ దాని అభివృద్ధి వెనుక చీకటి కోణం కూడా ఉంది. స్వేచ్ఛాయుతమైన ఉదారవాద విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేవి ఇవాళ చైనాలో ప్రశ్నార్థకం అవుతున్నాయి. పైగా చైనా విస్తరణ కాంక్షలు పెరుగుతూ ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సైనికంగా, వ్యూహపరంగా లద్ధాఖ్ సరిహద్దులో ఆ దేశాన్ని భారత్ తిప్పికొట్టింది. సరిహద్దుల్లో మనం సాధించిన సైనిక విజయాన్ని నిలబెట్టుకోవాలి. నేటి భారత్ 1960లు 1970ల నాటి భారత్‌గా లేదు. ఈరోజు మనం చైనాకే గుణపాఠం చెప్పగల స్థాయిలో ఉన్నాం. ఇది సరైన అవకాశం... ఇదే సరైన సమయం... నిస్సందేహంగా ఇది భారత యుగం. సంస్కృతీపరంగా నిరంతరం మార్పు చెందుతూ వస్తున్న ప్రపంచంలోని అతి కొద్ది దేశాల్లో చైనా ఒకటి. అయితే అదే సమయంలో విస్తరణవాద జాతీయవాదాన్ని అది తన పునాదిగా ఉంచుకుంటూ వస్తోంది. గత కొంతకాలంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థల్లో చైనా ఒకటి. దశాబ్దాలుగా, శాస్త్రీయ సోషలిజం, ప్రణాళికాబద్ధమైన ఆర్థికవ్యవస్థ, చైనా కమ్యూనిస్టు పార్టీ ఆచరించే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేవి ఆ దేశంలో ’ప్రగతి’ని ఒక ప్రోడక్ట్‌గా సృష్టిస్తూ వస్తున్నాయి. ‘గొప్ప ముందడుగు’ (గ్రేట్ లీప్ ఫార్వర్డ్) నుంచి ‘సాంస్కృతిక విప్లవం’ (కల్చరల్ రెవల్యూషన్) వరకు, అక్కడినుంచి ‘వినియోగదారీ సంస్కృతి’ ఘన విజయం వరకు ప్రయాణిస్తూ వచ్చిన చైనా ఈరోజు అత్యంత స్వీయ కేంద్రకమైన, ఆర్థిక బలసంపన్నమైన, భుజబలాన్ని ప్రదర్శిస్తున్న జాతిగా ఆవిర్భవించింది. కానీ చైనా సాధించిన ఈ అభివృద్ధి వెనుక చీకటి కోణం కూడా ఉంది. స్వేచ్ఛాయుతమైన ఉదారవాద విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేవి ఇవాళ చైనాలో ప్రశ్నార్థకం అవుతున్నాయి. పరస్పర అనుసంధానం శిఖరస్థాయికి చేరుకున్న మన ప్రపంచంలో చైనా నమూనా ఎంతకాలం కొనసాగుతుంది అనేది రాబోయే కొన్ని దశాబ్దాల పాటు తెమలని గూఢప్రశ్నగా ఉంటుంది. సోవియట్ పాత్ర చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ స్థాపన జరిగిన వెంటనే అంటే 1949లోనే మావో జెడాంగ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా మాస్కో వెళ్లి జోసెఫ్ స్టాలిన్‌ని కలిశారు. స్నేహం, పొత్తు, పరస్పర సహకారం ప్రాతిపదికన సోవియెట్ యూనియన్‌తో కుదిరిన ఒడంబడిక చైనా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. పైగా రష్యా ఒకప్పుడు ఆక్రమించుకున్న ప్రాంతాలు... ప్రత్యేకించి మంచూరియా, జింజియాంగ్లు తిరిగి చైనాలో భాగం కావడానికి ఈ ఒప్పందం వీలు కలిగించింది. టిబెట్‌ని చైనా తనలో కలుపుకున్న ప్పటికీ భారతదేశం మౌనం వహించడంలో ఇండో–సోవియెట్ సంబంధాలు ఒక ఉపకరణంగా పనిచేశాయి. పండిట్ నెహ్రూ నేతృత్వంలో అలీనోద్యమ నేతగా కొనసాగాలనే మన సొంత ఆకాంక్ష కారణంగానే కావచ్చు.. 1960లలో చైనా విస్తరణ కాంక్షలు శక్తిమంతంగా వ్యక్తమవడం ప్రారంభమైనప్పటికీ ఆశ్చర్యం గొలిపించే ప్రశాంతత మనల్ని ఆవరించింది. కానీ ఆనాటి మన వైఖరి మనకు దారుణ ఫలితాలను అందించిందని ఈరోజు మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం అంతర్జాతీయ అహింసావాణిగా కొనసాగలేకపోయాం, అలాగే మన సరిహద్దులను కూడా కాపాడుకోలేకపోయాం. (అ)సాంస్కృతిక విప్లవం వంద పూలు పుష్పించనీ, వేయి భావాలు వికసించనీ అనే భావనను గొప్పగా ప్రచారంలోకి తీసుకువచ్చిన మావో జెడాంగ్ తనకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి అసమ్మతినీ అణిచిపారేయడం ఆశ్చర్యం గొలుపుతుంది. 1958–61 సంవత్సరాల్లో దుర్బిక్షం కారణంగా లక్షలాదిమంది చైనా ప్రజలు మరణించారు. మరోవైపున కమ్యూన్లు అని పిలిచే ఉత్పత్తి సమాజాలు ఘోరంగా విఫలమయ్యాయి కానీ తీవ్రమైన అణచివేత కొనసాగింది. రాజకీయ లక్ష్యాల పరిపూర్తికోసం చౌ ఎన్ లై, డెంగ్ జియావోపింగ్ దేశ ఆర్థిక విధానాలను పునర్నిర్వచించడానికి తగు పునాది వేశారు. ప్రపంచీకరణ వెలుగులో చైనా వినియోగదారీ తత్వం 1977లో చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ పగ్గాలను డెంగ్ జియావోపింగ్ చేపట్టారు. చైనాను ప్రపంచ కార్ఖానాగా మార్చాలనే విస్తృత కార్యక్రమాన్ని చేపట్టారు. మావో నాలుగు చెడుల (పాత ఆలోచనలు, సంస్కృతి, ఆచారాలు, అలవాట్లు) నిర్మూలనకు ప్రాధాన్యమిస్తే, డెంగ్ నాలుగు అంశాలను (వ్యవసాయం, పరిశ్రమ, రక్షణ, టెక్నాలజీ ఆధునీకరణ) ప్రోత్సహించారు. 1980ల నుంచి వృద్ధిబాటలో నడిచిన చైనా ఆర్థిక వ్యవస్థ త్వరలోనే రెండంకెలను దాటేసింది. చైనాలో రాజకీయ అణచివేత గురించి ప్రపంచం మాట్లాడుతున్నప్పటికీ, ఏ దేశమూ చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోలేదు. ఏ బహుళజాతి సంస్థ కూడా చైనానుంచి వెళ్లిపోలేదు. చైనాతో వ్యాపారం సజావుగా కొనసాగుతూ వచ్చింది. ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తి చేసే విదేశీ భాగస్వామ్య సంస్థలకు చైనా అనేక రాయితీలు కల్పించి ప్రాధాన్యత నిచ్చింది. దీంతో స్థూలదేశీయోత్పత్తి సంవత్సరానికి 8 శాతం చొప్పున పెరిగి, త్వరలోనే రెండంకెలను దాటేసింది. 1997–98 సంవత్సరంలో చైనా, అమెరికా అధ్యక్షులు జియాంగ్ జెమిన్, బిల్ క్లింటన్ ఇరుదేశాల్లో పర్యటించారు. మూడేళ్ల తర్వాత చైనా ప్రపంచ వాణిజ్యసంస్థలో చేరింది. చౌక శ్రమ, ఎగుమతుల్లో పోటీపడటం అనే రెండు బలాల ప్రాతిపదికన చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రధానంగా ఆఫ్రికా, మధ్య ఆసియా నుంచి ఇంధనం, ముడి సరకులకు వనరుల సాధనలో చైనా గొప్ప విజయం సాధించింది. భారత్ బలాలు, ముందంజ బ్రిటిష్ వారిని 13వ దలైలామా ఇష్టపడకపోవడంతో తమ మాతృభూమి టిబెట్‌ను చైనాకు అప్పగించాల్సి వచ్చింది. అలాగే భారత్‌ను పాకిస్తాన్ ఇష్టపడకపోవడంతో తమ మాతృభూమిని నేడు చైనా హస్తగతం చేయాల్సి వస్తోంది. మన పొరుగుదేశంలో చైనా ఉనికి పెరుగుతోంది. చైనా రుణ ఊబిలో చిక్కుకున్న ఆఫ్రికా దేశాలు తమ వనరులను చైనాకు అప్పగించడమనేది భారత్‌ను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, దాని మానవీయ విలువలు చైనా ఆధిపత్య, విస్తరణవాద నమూనాకు వ్యతిరేకంగా నిలిచి తీరాలి. అలాగే చైనా సరిహద్దులో వ్యూహాత్మకంగా మనం సాధించిన సైనిక విజయాన్ని నిలబెట్టుకోవాలి. చైనా కారిడార్ అంటున్న బృహత్ ప్రాజెక్టుకు లద్ధాఖ్ సెక్టార్లో భారత సైన్యం ప్రమాదకరంగా మారింది కాబట్టే గల్వాన్‌లో సంఘర్షణ చోటుచేసుకుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ సరిహద్దులో భారతీయ రోడ్ నెట్‌వర్క్‌లు చైనా సరిహద్దు నిర్మాణాలకు ప్రమాదకరంగా మారాయి. అందుకే నేపాల్‌ను రెచ్చగొట్టి భారత్ లోని కాలాపానీ సెక్టార్ తమ భూభూగమంటూ కృత్రిమంగా ఘర్షణలు సృష్టించడానికి చైనా ప్రయత్నించింది. అరుణాచల్ ప్రదేశ్‌కి చైనా రాజధాని బీజింగ్ 2,350 కిలోమీటర్ల వ్యూహాత్మక దూరంలో ఉంది కాబట్టే బారత్ ఎదురుదాడికి బీజింగ్ నిర్ణయాత్మక దూరంలో ఉన్నట్లే. అందుకే చైనా చీటికీ మాటికీ అరుణాచల్‌ప్రదేశ్ సమగ్రత గురించి గగ్గోలు పెడుతుంటుంది. దాంట్లో భాగంగానే సముద్రజలాలపై భారత్ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు భారత్ శక్తివంతంగా ఉంది. చైనాకు ఆ విషయం తెలుసు. కాబట్టే మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చైనాపై మరింత ఒత్తిడికి గురిచేయాల్సి ఉంది. భారతీయ వ్యవసాయాన్ని, టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా పునర్నవీకరించడం తక్షణ అవసరం. 2031 నాటికి ముడిపదార్థాల తయారీ కేంద్రంగా భారత్ వృద్ధి చెంది మైక్రో–చిప్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చైనాను అధిగమించాల్సి ఉంది. వ్యవసాయాన్ని సంస్కరించడం నుంచి మేక్ ఇన్ ఇండియా దాకా; ఆత్మనిర్భర్ భారత్ నుంచి ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ దాకా లక్ష్య సాధనలో ప్రధాని నరేంద్రమోదీ మనల్ని సరైన దారిలో నడిపిస్తున్నారు. ఈ గొప్ప దేశానికి చెందిన ప్రజలమైన మనం, రోజువారీ కార్యాచరణలో జాతీయవాద స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మన వంతు దోహదం అందించాలి. నేటి భారత్ 1960లు 1970ల నాటి భారత్‌గా లేదు. ఈరోజు మనం చైనాకే గుణపాఠం చెప్పగల స్థాయిలో ఉన్నాం. ఇదే సరైన అవకాశం... నిస్సందేహంగా ఇది భారత యుగం. బండారు దత్తాత్రేయ (వ్యాసకర్త తాజాగా హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు) -
‘దాశరథి’ నేటికీ స్ఫూర్తిదాయకం
సాక్షి, హైదరాబాద్: మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతి వేడుకలు సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో కనులపండువగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖ సాహితీవేత్త, ఈ తరం వట్టికోటగా పేరొందిన కూరెళ్ల విఠలాచార్యకు ప్రతిష్టాత్మకమైన దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేశారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలంలోని తన స్వగ్రామం వెల్లంకిలో 80 వేలకుపైగా పుస్తకాలతో మహాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన కూరెళ్ల సాహితీసేవలను వక్తలు కొనియాడారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దాశరథి సాహిత్యం నిజాం కాలం నుంచి నేటివరకు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఆయన చేసిన కవితాగానం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమనినాదమై ఉత్తేజితం చేసిందన్నారు. కోటి రతనాల వీణ అయిన తెలంగాణలో కోటి ఎకరాల మాగాణాన్ని సస్యశామలం చేసే బృహత్తరకార్యాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణతల్లి బాధలను, కష్టాలను తీర్చే ఎదిగివచ్చిన కొడుకుగా దాశరథి కృష్ణమాచార్య ఉద్య మసాహిత్యాన్ని అందజేశారని కొనియాడారు. పల్లెపట్టుకే ఈ పురస్కారం అంకితం: దాశరథి పురస్కారాన్ని అందుకున్న విఠలాచార్య ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ పురస్కారాన్ని పల్లెపట్టుకే అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి రూ.లక్షా 16 వేల నగదు, వెండి మయూరి జ్ఞాపికను కూరెళ్లకు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, నందిని సిధారెడ్డి, బి.శివకుమార్, దాశరథి తనయుడు లక్ష్మణ్, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కళలకు ‘చంద్ర’గ్రహణం
సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్: ‘రాజాశ్రయం లేనిదే కళలు మనుగడ సాగించలేవంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలే ఈ బాధ్యతను తలకెత్తుకోవాలి. దురదృష్టవశాత్తు, గత నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆర్భాటాలే తప్ప. కళాసాంస్కృతిక రంగాల పట్ల ఏ కోశానా ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనపడటం లేదు’.. ‘సంగీత, నాట్య, వైణిక సుధాకర’, ధవళేశ్వరం, రావులపాలెం, రాజమహేంద్రవరంలలో సాంప్రదాయ కళల్లోశిక్షణ ఇస్తున్న శ్రీరాధాకృష్ణ సంగీత కళాక్షేత్ర వ్యవస్థాపకుడు డాక్టర్ గోరుగంతు బదరీనారాయణ ఆవేదన ఇది. దానవాయిపేటలోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రచారార్భాటాలు తప్ప, ఈ ప్రభుత్వ హయాంలో కళారంగానికి వీసమెత్తు మేలు కలగలేదని అంటున్నారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాలు, వెల్లడించిన అభిప్రాయాలు.. సాక్షి: గత నాలుగున్నరేళ్ళకుపైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, కళారంగాల వికాసానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మీ అభిప్రాయం? బదరీనారాయణ: శాస్త్రీయ, సాంప్రదాయ కళల వికాసానికి, ఆధ్యాత్మిక రంగంలో ప్రభుత్వం చేసింది శూన్యం. గతంలో సాంస్కృతిక శాఖకు కళలతో సంబంధం ఉన్న వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించేవారు. పాలనా నిర్వహణకు ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఇప్పుడు కళలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల చేతిలో ఈ శాఖ పనిచేస్తోంది. వీరికి కళలపై, కళాకారుల సమస్యలపై ప్రాథమిక అవగాహన కూడా లేదు. ఈ ధోరణి చూస్తూంటే కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వెలువడిన ఒక సినిమాలోని (‘స్వర్ణకమలం’ కావచ్చు) దృశ్యం గుర్తుకు వస్తోంది. వేదపండితులకు భృతి ఇస్తున్నారని తెలిసి, ఒక ఘనపాఠి సంబంధిత అధికారి వద్దకు వస్తాడు. ‘అయ్యా, నేనొక ఘనపాఠీని’ అని పరిచయం చేసుకుంటాడు. ‘ఘనపాఠీయా?–అంటే ఏమిటి? అదో డిగ్రీనా, బీఏ, ఎంఏలాగా?’ అని ఆ అధికారి అడుగుతాడు! ఇప్పుడు సాంస్కృతిక శాఖలో కళారంగానికి చెందిన నిష్ణాతులు ఎవరున్నారు? అన్ని సంస్థలూ రాజకీయపునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి తప్ప!..ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వరంగానికి సంబంధించి, ఒకే ఒక సంగీత, నృత్యపాఠశాల ఉంది. మరికొన్ని కళాశాలల స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆయన అకాలమరణంతో అన్నీ అటకెక్కాయి. సంప్రదాయానికి విరుద్ధంగా గోదావరి హారతి సాక్షి: సంప్రదాయాలకు ఎందుకు చెల్లుచీటీ ఇస్తున్నారు? సినీజీవుల సూచనలమేరకే మార్పులు జరుగుతున్నాయా? బదరీనారాయణ: నేను సినిమాలకు వ్యతిరేకం కాదు. కానీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో ఆయా నిపుణులతో నిర్వహణ సాగాలి. గంగానది మెట్లపై నిలబడి, అర్చకులు గంగాదేవికి హారతులు ఇస్తారు. ఇక్కడ? గోదావరి జలాలలో పంటుపై నిలబడి, మెట్లకు, అక్కడ ఉన్న ఎన్టీ రామారావు విగ్రహ పృష్ఠభాగానికి హారతి ఇస్తున్నారు. ఇదెక్కడి సాంప్రదాయం? నదీప్రవాహానికి అభిముఖంగా హారతి ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు చెబుతున్నారు. ఎవరో సినిమాదర్శకులో, మరొకరో చెబితే, మార్పులు చేసేస్తున్నారు. మెట్లకు అభిముఖంగా హారతి ఇవ్వడానికి ప్రమాణం ప్రభుత్వం చూపగలదా? వీఐపీలకు ‘వెచ్చించిన’ ప్రాంతాలట.. సాక్షి: ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను కొన్ని లక్షలు ఖర్చుచేసి, ఈవెంట్ మేనేజర్లకు నిర్వహణా బాధ్యతలు అప్పగించడంపై మీ అభిప్రాయం? బదరీనారాయణ: కోటిలింగాలరేవులో జరిగిన ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యాతను కూడా బయట నుంచి తీసుకువచ్చారు. ‘వీఐపీలకు వెచ్చించిన’ ప్రాంతాలలో వారినే కూర్చోనివ్వండి’ అంటూ, ‘దిగుమతి’ అయిన యాంకర్ చెబుతూంటే, ప్రేక్షకులు నవ్వుకున్నారు. అందని ద్రాక్షలా కళాకేంద్రం అద్దెలు సాక్షి: రాజమహేంద్రవరానికి ఎంపీ సినీరంగం నుంచే వచ్చారు కదా? ఇక్కడి పరిస్థితులపై మీ అంచనా? బదరీనారాయణ: హైదరాబాద్ రవీంద్రభారతి స్థాయిలో ఆనం కళాకేంద్రాన్ని ఆధునికీకరించారు, సంతోషం! అయితే, అద్దె ఎవరికీ అందుబాటులో లేదు. ఒకరోజుకు సుమారు రూ.20,000 అద్దె, రూ.10,000 కరెంటు ఛార్జీలు కట్టడం సాంస్కృతిక సంస్థలకు సాధ్యమయ్యేపనేనా? నాటకాలు, నాటికలు, నృత్యాలు అన్నీ ఉచితంగానే జరుగుతాయి కదా? ఇంత పెనుభారం తగ్గించమని ఎందరో కళాకారులు వినపతిపత్రాలు ఇచ్చారు. అవన్నీ ‘అంధేందూయముల్, మహాబధిర శంఖారావముల్’గా మిగిలిపోయాయి.ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సంవత్సరంలో అత్యధిక రోజులు ఆనం కళాకేంద్రం ఖాళీగా ఉంటోంది. అద్దె తగ్గించి, వినిమయాన్ని పెంచగలిగితే, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఒకప్పుడు విమానయానం ఖర్చు నింగిపై ఉండేది. టిక్కెట్ ధర తగ్గాక, అన్ని విమానాలు ‘ఫుల్’ అవుతున్నాయి? ఈ ఫార్ములా అవలంబిస్తే, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల కోసం పురమందిరానికి ఆనుకుని ఒక వేదిక ఉంది. ఒకప్పుడు ఈ వేదిక ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఈ వేదిక ‘వెంటిలేటరు’ మీదకు చేరుకుంది. పది లక్షల స్వల్ప మొత్తంతో ఈ వేదికను అభివృద్ధి చేయవచ్చు. ఈవెంట్ మేనేజిమెంట్లకు, పుష్కరాలలో బాణసంచాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. రూ.ఆరు వేలతో ఎలా బతకగలరు? సాక్షి: జిల్లాలో నాట్యకళావికాసానికి నాట్యగురువులను నియమించారు కదా? బదరీనారాయణ: నియమించారు, సంతోషం. లక్ష్యం ఎక్కడి వరకు నెరవేరుతోంది? జిల్లాలో వారానికి అయిదు రోజులు పర్యటించి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలల్లో నాట్య గురువు నాట్యం బోధించాలి. వారికి ఇచ్చే వేతనం నెలకు రూ. ఆరు వేలు. పర్యటనలకు ప్రభుత్వం టీఏ, డీఏలు ఇవ్వదు. అన్నీ ఆ ఆరు వేలల్లోనే. చేతికి మిగిలేది నెలకు ఏ రెండు వేలో, దీనితో వారు మనుగడ ఎలా సాగించగలరు? వృత్తికి ఏమి న్యాయం చేయగలరు? నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనులవుతారు.. సాక్షి: చివరిగా మీరిచ్చే సందేశం ఏమిటి? బదరీనారాయణ: ఆధ్యాత్మిక, కళా సాంస్కృతిక రంగాలను పట్టించుకునే ప్రభుత్వానికే మనుగడ ఉంటుంది. లేకపోతే, పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. -
ఊరికి పరంపర
చెట్టు ఎంత ఎదిగినా వేళ్లను వదిలిపెట్టదు. తాను ఎదుగుతున్న కొద్దీ వేళ్లను కూడా అంతగా విస్తరించుకుంటుంది. మహావృక్షంగా మారిన తర్వాత ఊడలను దించుకుంటుంది. మరి.. మనుషులం? మన మూలాలను పుటుక్కున తెంచేసుకుంటున్నాం. ‘ఎంత ఎత్తుకి ఎదిగినా పాదాలు ఉండాల్సింది నేల మీదనే’ అనే చిన్న సూత్రాన్ని మర్చిపోతున్నాం. ‘‘అది గుర్తు చేయడానికే ‘పరంపర’ కల్చరల్ ఆర్గనైజేషన్‌ను స్థాపించాం.. అంటున్నారు డాక్టర్ శ్రీనాగి, శశికళ. దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘‘తమిళనాడు, కర్ణాటక వాళ్లు సంస్కృతికి దూరం కారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా సరే.. ఏడాదిలో ఒకసారి వారి సొంత ప్రదేశాలకు చేరిపోతారు. అందరూ కలిసి సంగీతం, నాట్యాలతో వాళ్ల సంప్రదాయ రీతులను ప్రదర్శించుకుంటారు. ఇక్కడ ప్రదర్శకులు వేరు, ప్రేక్షకులు వేరు కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ్యత తీసుకుంటారు. ఒకరు ప్రదర్శిస్తుంటే మిగిలిన వాళ్లు ప్రేక్షకులైపోతారు. సాంస్కృతిక వేడుకలు పూర్తయిన తర్వాత తిరిగి తమ తమ ఉద్యోగాలకు వెళ్లిపోతారు. ఐదేళ్ల కిందట ఒక స్నేహితురాలి ఆహ్వానంతో బెంగళూరుకెళ్లినప్పుడు వాళ్ల సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించుకుంటున్న తీరు తెలిసింది. తెలుగువాళ్లకు అలవాటు చేద్దామనిపించింది’’ అన్నారు డాక్టర్ శ్రీనాగి. మనకూ వేదికలు.. వేడుకలు ‘‘మనదైన శాస్త్రీయ సంగీత కచేరీలు, సంప్రదాయ నాట్యరీతులు ఉన్నాయి. వాటిని ప్రదర్శించడానికి హైదరాబాద్‌లో రవీంద్రభారతి, శిల్పకళావేదిక వంటి వేదికలూ ఉన్నాయి. ప్రతి పట్టణంలోనూ ఇలాంటి వేదికలూ ఉండనే ఉన్నాయి. అయితే కళాభిరుచి ఉన్న వాళ్లను మాత్రమే ఆకర్షిస్తాయవి. సంస్కృతి గురించి ఏమీ తెలియని వారికి కూడా మన సంస్కృతి మూలాల దగ్గరకు తీసుకురావాలంటే మాకు కనిపించిన మార్గం ఒక్కటే. ఆ కార్యక్రమాలను వారి ముంగిటకు తీసుకెళ్లడమే. అందుకే నాలుగేళ్ల నుంచి కళాసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నాం’’ అని పరంపర కల్చరల్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారు శశికళ. డాక్టర్ శ్రీనాగి, శశికళ ఇద్దరూ తమవంతు బాధ్యతగా సామాజిక కార్యక్రమాలను నిర్వహింస్తుంటారు. ‘రోష్ని’ స్వచ్ఛంద సంస్థ స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు శశికళ. రోష్ని సంస్థ ఆత్మహత్యకు పాల్పడే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది. జీవితం మీద ఆసక్తి కోల్పోకుండా చేస్తుంది. జీవితంలో కష్టాలుంటాయి, కానీ అవి జీవితానికి డెడ్ఎండ్లు కాదు, టర్నింగ్‌లు మాత్రమేననే మంచి మాటలతో నిరాశానిస్పృహలను తొలగించి జీవితేచ్ఛ కలిగిస్తుంటుంది రోష్ని సంస్థ. వీరిద్దరి స్నేహం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల పరిరక్షణ బాధ్యతను తలకెత్తుకుంది. ‘పరంపర... నర్చరింగ్ కల్చర్’ అనే ట్యాగ్‌లైన్‌లోనే తామేం చెప్పదలుచుకున్నామో ఉందంటారు శ్రీనాగి, శశికళ. గుడిలోనే ఎందుకు? సాంస్కృతిక కార్యక్రమాలను గుడి ఆవరణలో నిర్వహించడం వెనుక బలమైన కారణాన్ని చెబుతున్నారీ మహిళలు. ‘‘ప్రతి ఊళ్లోనూ ఆలయం ఉంటుంది. గుడి ధార్మిక ప్రదేశమే. అయితే మతపరమైన పరిధితో గిరిగీసుకునే ప్రదేశం కాదు. ఆ గ్రామస్తు లందరికీ సమావేశ వేదిక. ఊరికి, ఊళ్లో వాళ్లకు సంబంధించిన ఏ అంశాన్నయినా గుడి ఆవరణలోనే చర్చించుకునేవాళ్లు. ఆ సంస్కృతిని గుర్తు చేయడానికే గుడి ఆవరణను ఎంచుకున్నాం. ఎక్కడెక్కడ ప్రాచీన ఆలయాలున్నాయో శోధించాం. శంషాబాద్ దగ్గర అమ్మపల్లె రామచంద్రస్వామి ఆలయం ఏడు వందల ఏళ్ల నాటిది. మనం గుజరాత్కెళ్లి చూసొచ్చే స్టెప్‌వెల్ కూడా ఉందీ ఆలయం సమీపాన. చాలామందికి అక్కడ అంత గొప్ప ప్రాచీన ఆలయం ఉందనే సంగతి కూడా తెలియదు. నాలుగేళ్లు మేము ఆ ఆలయంలో కూడా ఒక వేడుకను నిర్వహించడంతో ఇప్పుడు అక్కడికి భక్తులు ముఖ్యంగా పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. భువనగిరిలోని అక్కన్న మాదన్నల ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం ఈతరం చాలా మందికి తెలియడమే లేదు. మా గుడి సంబరాల నిర్వహణకు ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలనే ఎన్నుకుంటున్నాం. కళాకారుల ఎంపికలో మేము ఇప్పటికే పేరు గడించిన వారి కోసం ప్రయత్నించడం లేదు. టాలెంట్ ఉండి పెద్దగా గుర్తింపునకు నోచుకోని వారి కోసం గాలించినంత పని చేస్తున్నాం. ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్న పని. ప్రదర్శనకు టికెట్ ఉండదు. వీలయినంత ఎక్కువ మందికి మన మూలాలను తెలియచేయడమే మా ఉద్దేశం. ఎవరైనా స్థానికంగా మాకు సహకరిస్తే వారి సహాయం తీసుకుంటున్నాం. మై హోమ్, బీవీఆర్, ఏఎమ్ఆర్ వంటి సంస్థలు కొంత వరకు ఆర్థిక తోడ్పాడునిస్తున్నాయి. గద్వాల్ కోటలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ నృత్యనాటకాలను ప్రదర్శించాం. మహబూబాబాద్‌లో ‘నర్తనశాల’ ప్రదర్శించాం. ఆ ప్రదర్శన గురించి తెలిసిన వరంగల్ ఎమ్మెల్యే తర్వాతి ప్రదర్శన భద్రకాళి ఆలయంలో పెట్టమని అడిగారు. అలా ఎక్కడికక్కడ స్థానికంగా ఎవరైనా ముందుకు వచ్చి సహకరిస్తే మాకు కొంత బరువు తగ్గుతుంది. అలా లేనిచోట పూర్తి బాధ్యత మాదే. ఈ వేడుకలు ఈ రోజు (జనవరి 11న) మొదలయ్యాయి. ఏటా జనవరి నుంచి మార్చి వరకు సాగే ఈ కార్యక్రమాల్లో మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్లందరికీ ఇదే మా ఆహ్వానం’’ అన్నారు డాక్టర్ శ్రీనాగి, శశికళ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి కార్యక్రమాల ‘పరంపర’: జనవరి 11 : కనకదుర్గ ఆలయం, విజయవాడ (ముగిశాయి) జనవరి 13 : భావ నారాయణ ఆలయం, బాపట్ల; జనవరి 16 : వేయి స్తంభాల గుడి, వరంగల్ జనవరి 19 : శ్రీ రామచంద్రస్వామి ఆలయం , అమ్మపల్లె, శంషాబాద్, హైదరాబాద్ జనవరి 27 : వేణుగోపాల స్వామి ఆలయం, అక్కన్నమాదన్న ఆలయం, భువనగిరి ఫిబ్రవరి 2 : వీరభద్రస్వామి ఆలయం, అప్పా సర్వీస్ రోడ్, నార్సింగి, హైదరాబాద్ ఫిబ్రవరి 22 : అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, మామిడిపల్లి, నిజామాబాద్ మార్చి 4 : ధర్మపురి క్షేత్రం, మియాపూర్, హైదరాబాద్ -
రారండోయ్.. కైటెగరేద్దాం..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు రంగురంగుల రంగవళ్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, కోడి, ఎడ్ల పందాలు, భోగి మంటలు, పిండి వంటలు. వీటన్నిటికంటే పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం రంగురంగుల పతంగుల విన్యాసాలతోనే. పతంగుల పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భాగ్యనగరమే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా పతంగుల పండగను మాత్రం హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా నిర్వహిస్తారనడంలో సందే హం లేదు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పండగలకు ప్రాధాన్యత పెరిగింది.నాలుగేళ్లుగా టూరిజం, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ సారీ 13, 14, 15 తేదీల్లో పండగను వైభవంగా నిర్వహించేందుకు ఆ శాఖలు సిద్ధమయ్యాయి. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ నెల 13న మూడు గంటలకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు ప్రత్యేకంగా ఆయన్ని ఆహ్వానించాయి. కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. నోరూరించే తెలంగాణ వంటకాలు.. హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్‌ను ఈసారీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 100 కైట్స్‌ప్లేయర్స్ పతంగుల పండగలో పాల్గొననున్నారు. రంగురంగుల పతంగులతో బైసన్‌పోలో, పరేడ్ గ్రౌండ్స్ హరివిల్లులా మారనున్నాయి. దీనికితోడు భోజనప్రియుల కోసం రాత్రి సమయంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌కోర్టులు ఆకర్షణగా నిలవనున్నాయి. అటుకుల ఉప్మా, అరటిపండు కేక్, ఉల్లివడియాలు, కట్టెపొంగలి, స్వీట్ కార్న్ రైప్, క్యారెట్ కేకు, కొత్తమీర చట్నీ, గుమ్మడి కాయ కూర, గొంగూర పచ్చడి, పప్పు, చింతచిరుగు పప్పుతో పాటు వందలాది రాష్ట్ర వంటకాలు నగర వాసులను నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలపై భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక సంచికను తీసుకురానున్నది. సంచికను సంక్రాంతి రోజు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో మినీ భారత్ సంస్కృతి, సంప్రదాయాలు పరేడ్ గ్రౌండ్లో కన్పించనున్నాయి. ఇందులో తెలంగాణ కల్చర్‌తోపాటు ఒడిస్సి, బిహు, బెంగాళీ, కథక్, అస్సామీ, కశ్మీరీతోపాటు అన్ని రాష్ట్రాల నృత్య ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులు గురువారం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
విజయవాడలో పుస్తక మహోత్సవం
సాక్షి, విజయవాడ: వచ్చే జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని స్వరాజ్ మైదానంలో 30వ పుస్తక మహోత్సం ప్రారంభమవుతుందని, నవ్యాంధ్ర పుస్తక సంబరాల కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. పుస్తక మహోత్సవాలకు సంబంధిచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలను నవ్యాంధ్ర పుస్తక సంబరాలు 2019 పేరుతో నిర్వహిస్తున్నాం. పుస్తక ఉత్సవాలను విజయవాడ బుక్ ఫెస్టివల్, ఎన్టీఆర్ ట్రస్ట్, ఏపీ భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిసున్నామని అన్నారు. ఈ పుస్తక ఉత్సవాలను ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీ, ఆచార్య కొలకలూరి నవీన్, ఆచార్య రఘురాజులు ప్రారంభ సభకి హాజరవుతారు. ప్రారంభ సభలో ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీల కీలక ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. జనవరి 4వ తేదీన పుస్తక ప్రియుల నడక కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఆంధ్ర జ్యోతి సంపాదకులు, కె.శ్రీనివాస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు పాల్గొంటారు. 5వ తేదీన జరిగే సాహితీ సభకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హాజరవుతారని కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు దివ్యాంగురాలు, యువ పెయింటర్ నఫీస్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ గత నెలలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న నఫీస్ అద్భుతమైన చిత్రకళను చూసి మంత్రి అభినందించారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని, జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పెన్షన్‌తోపాటు ఆమెకు అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ నఫీస్ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రూ.10 లక్షలను జాయింట్ అకౌంట్లో జమ చేసింది. దీని ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసింది. నఫీస్‌కు ఈ పెన్షన్ సౌకర్యం జీవితాంతం ఉం టుందని సాంస్కృతిక శాఖ అధికారులు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణను కేటీఆర్ అభినందించారు. -
నృత్యార్చన
-
నేత్రపర్వం
విజయవాడ(వన్‌టౌన్): మహాభారతంలోని గయోపాఖ్యనం సన్నివేశాన్ని కళాకారులు అత్యద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న కళారూపాలలో భాగంగా మంగళవారంనాటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గుడివాడకు చెందిన వల్లూరి శ్రీహరిరావు బృందం గయోపాఖ్యానం పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. చక్కని నటనతోపాటుగా మధురమైన గానంతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఈ నాటకానికి వల్లూరి శ్రీహరిరావు దర్శకత్వం వహించి నటించగా మిగిలిన పాత్రల్లో సోము అంజిరెడ్డి, సాలువాచారి, జంగయ్యగౌడ్, ఎన్.చంద్రబాబు, కోటేశ్వరరావు తదితర పాత్రల్లో నటించి మెప్పించారు. బీటీ నాయుడు చక్కని ఆహార్యాన్ని అందించారు. నగరానికి చెందిన వై.గోపాలరావు బృందం సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించింది. దీనికి గోపాలరావు దర్శకత్వం వహించి కీలకపాత్ర పోషించగా మిగిలిన పాత్రల్లో కె.మంగాదేవి, పద్మావతి, తవిటి నాయుడు, ఎంఎల్ రమణలు నటించి అలరించారు. తొలుత డాక్టర్ ఎస్పీ భారతి బృందం కూచిపూడి నాట్యాంశాలను ప్రదర్శించారు. ఒంగోలుకు చెందిన శ్రీనళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్కు చెందిన కళాకారులు కూచిపూడికేళిక రూపకాన్ని ప్రదర్శించారు. అలరింపు, తిళ్లానా తదితర అంశాలను చూడముచ్చటగా ప్రదర్శించారు. కె.శ్రావ్య, సురేష్‌బాబు, స్రవంతి, లాస్య, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన దామోదర గణపతిరావు జానపదాలు జనరంజకంగా సాగాయి. గణపతిరావు బృందం పలు జానపదాలను గానం చేస్తూ నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ఆయన బృందంలో గణపతిరావుతో పాటుగా కొంపల్లి బాలకృష్ణ, సతీష్, సుజాత, పరమేష్, ఫణి తదితరులు పాల్గొన్నారు. కళాకారులను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ అభినందించారు.