ప్రపంచానికి భారతం కావాలి | Kuchipudi is Performing at Ravindra Bharat in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి భారతం కావాలి

Published Wed, May 8 2019 2:07 AM | Last Updated on Wed, May 8 2019 4:51 AM

Kuchipudi is Performing at Ravindra Bharat in Hyderabad - Sakshi

అమెరికాలోని గన్‌ కల్చర్‌ గురించి విన్నప్పుడు ‘ఇదేంటి.. అక్కడి పిల్లల్ని అమ్మానాన్నలు పట్టించుకోరా!’ అనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో జరిగిన  ఘటనలకు ఇండియాలో ఉన్న మనకే ఇలా అనిపిస్తే.. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన అరుణిమకు ఎలా ఉండాలి? అసలు కుటుంబ వ్యవస్థే పటిష్టంగా లేని వాతావరణంలో పిల్లలకు విలువలు ఎలా అలవడతాయి? ‘అందుకే మా పిల్లల్ని ఇండియాకు తీసుకొచ్చి మరీ అవన్నీ నేర్పించాను’ అన్నారు అరుణిమ. ప్రపంచానికి భారతీయత అవసరం ఎంతైనా ఉందని కూడా అంటున్నారామె. 

ఏప్రిల్‌ 27వ తేదీ. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కూచిపూడి ప్రదర్శన జరుగుతోంది. అది అరుణిమ కూతురు ఇషిక అరంగేట్రం. గణేశ పంచరత్నం, రుక్మిణీ ప్రవేశం, మహిషాసుర మర్దని, బాలగోపాల తరంగం, పరులన్నమాట, శివాష్టకం ప్రదర్శించింది ఇషిక. గణేశ పంచరత్నం రూపకంలో ఇషికతోపాటు ఇషిక అమ్మ కూడా నాట్యం చేశారు. ఏ తల్లికైనా తనను... తన పిల్లల పేరు చెప్పి, వాళ్లకు తల్లిగా గుర్తిస్తే పట్టలేనంత సంతోషం కలుగుతుంది. తన ఐడెంటిటీ తన పిల్లలే అయినప్పుడు తల్లి పొందే ఆనందం అది. అలాంటి సంతోషాన్నే ఆస్వాదిస్తున్నారు అరుణిమ ఇప్పుడు. ఇషిక పుట్టింది అమెరికాలో. ఐదేళ్ల వయసులో తల్లి, తమ్ముడితోపాటు ఇండియాకి వచ్చేసింది.

ఆ రావడానికి దారి తీసిన పరిస్థితులు ఎవరికైనా మనసును కదిలిస్తాయి. నిజానికి అవేవీ ఇషిక, అరుణిమల కుటుంబ సమస్యలు కావు. అమెరికా కుటుంబాల సమస్యలు. అమెరికాలో వేళ్లూనుకోని కుటుంబ వ్యవస్థ కారణంగా ఎదురవుతున్న సామాజిక సమస్యలు. గాల్లో దీపంలా మిణుకు మిణుకు మంటున్న అమెరికా పిల్లల బాల్యమే ఈ తల్లీబిడ్డలను ఇండియాకు తెచ్చింది. ఆ వివరాలను అరుణిమ సాక్షితో పంచుకున్నారు.‘‘నాకు 2000లో పెళ్లయింది. నా భర్త సత్యనారాయణ రాజు అప్పటికే యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయిన వెంటనే నేనూ అమెరికా వెళ్లాను. అక్కడ మెంటల్‌హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశాను. మానసిక స్థితి సరిగా లేని పిల్లల కేస్‌స్టడీలు చదువుతుంటే గుండె కలచివేసినట్లయ్యేది. అభివృద్ధి సాధించిన దేశంలో పిల్లలు ఇంతటి మానసిక అనారోగ్యానికి గురికావడం ఏమిటని కూడా అనిపించేది.

అధ్యయనం చేసే కొద్దీ తెలిసిందేమిటంటే.. అక్కడ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం అని. మెంటల్‌ హెల్త్‌లో పాతికేళ్లు అమెరికాలోనే రీసెర్చ్‌ చేసిన ఒక మహిళా సీనియర్‌తో ఈ విషయాలను షేర్‌ చేసుకున్నప్పుడు ఆమె..  ‘ఈ పిల్లల్లో ఎక్కువ మంది సింగిల్‌ పేరెంట్‌ పెంపకంలో ఉన్న వాళ్లే. ఈ పిల్లల ఇంటి వాతావరణాన్ని మార్చగలిగితే వీళ్లను ఆరోగ్యవంతులను చేయడానికి మెంటల్‌ హెల్త్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం ఉండదు కూడా’ అన్నారు. ఫ్యామిలీ బాండింగ్‌ ఉన్న కుటుంబాల్లో పిల్లల్లో ఇలాంటి ధోరణి తలెత్తదు. ఒకవేళ వేరే పిల్లల్ని చూసి అనుకరించినా సరే.. అమ్మానాన్నలు బాధ్యతగా వాళ్లకు వాల్యూస్‌ నేర్పించినట్లయితే అన్నీ సమసి పోతాయని కూడా చెప్పారామె. పిల్లల్ని అమెరికాలో పెంచుతూ ఇండియన్‌ ఫ్యామిలీ వాల్యూస్‌ని నేర్పించడం కంటే, ఇండియాలో పెంచడమే మంచిదనిపించి ఇండియాకి వచ్చేశాం. ఈ పదేళ్లలో మా రాజు గారికి ఇండియాకి– అమెరికాకి షటిల్‌ చేసినట్లయింది’’ అన్నారు అరుణిమ నవ్వుతూ.

ప్రపంచానికి భారతం కావాలి
పిల్లల పెంపకంలో ఒక తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే.. అరుణిమ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపించవచ్చు. కానీ ఆమె విశ్లేషణ మాత్రం సమాధానపరిచేటట్లే ఉంది. ‘‘పిల్లలను ఇండియాలో పెంచడం అనే నిర్ణయానికి గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే... అమెరికా.. పైకి ఓపెన్‌ సొసైటీగా కనిపిస్తుంది. కానీ అందులో మనం చాలా క్లోజ్‌డ్‌గా ఒక చట్రంలో జీవించేస్తాం. ఇండియాలో అనేక చట్రాల మధ్య జీవిస్తున్నట్లు ఉంటుంది. కానీ నిజమైన సమాజాన్ని చూడగలిగింది ఇండియాలోనే.

జీవితపు గ్రౌండ్‌ రియాలిటీ తెలిసేది మనదేశంలో పెరిగినప్పుడే. ఇక కల్చర్‌ విషయానికి వస్తే.. నా వంతుగా తెలుగు భాషను, భారతీయ కుటుంబ విలువలను మరో తరం వరకు పరిరక్షించగలిగాను. అలాగే పిల్లలకు భారతీయ సంస్కృతిని వివరించగలిగాను. ‘బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, గాజులు ఎందుకు వేసుకోవాలి’.. ఇలా ప్రతి ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయతను చెప్తూ పెంచాను. అలాగని రోజూ పెద్ద బొట్టు పెట్టుకోమనే కండిషన్‌ ఏమీ ఉండదు. సంప్రదాయం కోసం పిల్లల సౌకర్యాన్ని హరించడమూ ఉండదు’’ అంటూ వెకేషన్‌లో ట్రాక్‌ సూట్‌లో సేదదీరుతున్న ఫ్యామిలీ ఫొటోలను చూపించారు.

అంతరయానం... కలివిడితనం
ఇండియా నుంచి వెళ్లి విదేశాల్లో ఉన్న వాళ్లలో ప్రతి ఒక్కరికీ కనీసం ఏదో ఒక్కటైనా సరే ఇండియన్‌ ఆర్ట్‌  వచ్చి ఉండాలని అరుణిమ అభిప్రాయం. మన కల్చరే గొప్ప అని ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి కాదు, ఇది మా కల్చర్‌ అని చెప్పుకోగలగడానికి మాత్రమేనంటారామె. ‘‘ఇషికకి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పించాం. అయితే ఇంత బాగా పెర్‌ఫార్మ్‌ చేస్తుందని ఊహించలేదు. డాన్స్‌ మనిషికి తనలోకి తాను ప్రయాణించగలిగిన గొప్ప లక్షణాన్ని నేర్పిస్తుంది. ఆటలతో తోటి వాళ్లతో కలివిడిగా మెలగడం అలవడుతుంది. నేను చేసిన ఆ ప్రయత్నం ఇషికలో ఎంతటి పరిణితిని తెచ్చిందంటే.. తాను బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌గా స్కూల్‌ టీమ్‌కు కెప్టెన్‌గా చేసింది. అప్పుడు మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డును వరుసగా రెండేళ్లు అందుకుంది.

అప్పుడు వచ్చిన విమర్శలను ఇషిక ఎంత సమర్థంగా చక్కదిద్దుకున్నదంటే.. ప్రిన్సిపల్‌ను కలిసి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డును పక్షపాత ధోరణిలో సెలెక్ట్‌ చేశారనే ఆరోపణ వచ్చిన తర్వాత నేను కెప్టెన్‌గా కొనసాగడం సరి కాదు. మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే నేను టీమ్‌లో ఒక ప్లేయర్‌గా నా లెవెల్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ చూపిస్తాను’ అని చెప్పింది. ప్రిన్సిపల్‌ ఎంత తరచి అడిగినా... తనను ట్రోల్‌ చేసిన వాళ్ల పేర్లు మాత్రం చెప్పనేలేదు. ప్రిన్సిపల్‌ నాతో ఆ సంగతి చెప్పినప్పుడు మా అమ్మాయిలో నాకు పరిపూర్ణమైన కొత్త ఇషిక కనిపించింది. మా నాన్నగారు ఎప్పుడూ  నాతో ‘నీకు వరపుత్రిక పుట్టింది’ అంటుంటారు. ఆ మాట నిజమే అనిపించింది కూడా’’ అన్నారు అరుణిమ.
– వాకా మంజులారెడ్డి

ఒకరి త్యాగం అవసరమే
ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ కెరీర్‌ ఓరియెంటెడ్‌గా ఉండడం అవసరమే. అయితే పిల్లల కోసం తల్లిదండ్రుల్లో ఒకరు కొంత త్యాగం చేయకతప్పదనే చెప్పాలి. నేను వైజాగ్‌ సెయింట్‌ జోసెఫ్‌లో డిగ్రీ చేసి, కోయంబత్తూరులో హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ చేసి అదే కాలేజ్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేశాను. పెళ్లితో నా  కెరీర్‌ లైన్‌ మారింది. యుఎస్‌లో బిహేవియర్‌ థెరపీ చేసి మెంటల్‌ హెల్త్‌కి మారాను. పిల్లల కోసం ఇండియాకి వచ్చిన తర్వాత స్కూల్‌లో చేరి పాఠాలు చెప్పాను. మా అమ్మాయికి టెన్త్‌ అయిపోయింది. తనకు బయోటెక్నాలజీ ఇష్టం. అందుకే మళ్లీ అమెరికా ప్రయాణమవుతున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత నా కెరీర్‌ ప్లాన్స్‌ అన్నీ మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి.

తల్లిగా విజయవంతమయ్యానా లేదా అని చెప్పడానికి ఇంకా కొంత టైమ్‌ కావాలి. అయితే మా అమ్మాయితో కలిసి కూచిపూడి నాట్యంలో వేదికను పంచుకోవడం, మా పిల్లలిద్దరూ స్టేట్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్స్‌ కావడం తల్లిగా నేను అత్యంత సంతోషాన్ని పొందిన క్షణాలు. తల్లి ఎంత మంది పిల్లలను కన్నా సరే... తొలిబిడ్డను కన్నప్పుడు పొందినంత సంతోషాన్ని ప్రతిసారీ ఆస్వాదిస్తుంది. పిల్లల పురోగతి కూడా అలాంటిదే. చిన్న అచీవ్‌మెంట్‌ అయినా సరే ఎవరెస్ట్‌ను అధిరోహించినంత మురిసి పోయేది తల్లి మాత్రమే. వాళ్ల కోసం చేసిన త్యాగం కష్టమనిపించదు. అవసరమైన పనే చేశాననే సంతృప్తి తల్లికి ఉంటుంది.
– అరుణిమ, ఇషిక తల్లి

అమ్మకు అడుగులు నేర్పాను
అమ్మ డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేటప్పుడు తన స్టెప్స్‌ని కరెక్ట్‌ చేసేదాన్ని. అమ్మను కరెక్ట్‌ చేసే చాన్స్‌ వచ్చిందని చాలా ఎంజాయ్‌ చేశాను. గత వారం తిరుమలకు వెళ్లాం. అక్కడ నాద నీరాజనం వేదిక మీద డాన్స్‌ చేస్తున్న గొప్ప గొప్ప కళాకారులను చూసినప్పుడు నేను కూడా ఎప్పటికైనా ఆ వేదిక మీద నాట్యం చేయాలనిపించింది. ఇప్పుడు అమెరికా వెళ్లిన తర్వాత కూడా ప్రాక్టీస్‌ ఆపను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement