
దొరికిన యువకుడు సూది సైకో కాదు!
తమకు దొరికిన వ్యక్తి 'సూది సైకో' కాదని పోలీసులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'సూది సైకో' ఇప్పటికీ దొరకనట్లు దీంతో స్పష్టమైంది.
తమకు దొరికిన వ్యక్తి 'సూది సైకో' కాదని పోలీసులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'సూది సైకో' అనే అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారించగా, అతడు ఈ నిందితుడు కాడని తేలింది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో ఓ యువకుడు ఇంజక్షన్‌తో పట్టుబడటంతో.. అనుమానించిన ఆత్రేయపురం ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్.. రావులపాలెం సీఐ రమణ ముందు హాజరుపరిచారు.
కడియం మండలానికి చెందిన అతడు నర్సాపురం - రాజమండ్రి మధ్య ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా నర్సాపురం డిపోలో పనిచేస్తున్నాడు. గతంలో తన బంధువులకు వైద్యం నిమిత్తం ఇంజక్షన్ తీసుకువచ్చానని, అది మరచిపోయి వాహనంలోనే ఉంచానని ఆ యువకుడు చెప్పినట్టు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైకో మరొకరిపై సూదిపోటు ప్రయోగించినట్లు తెలిసింది. దీంతో విచారణ అనంతరం అతడిని విడిచిపెట్టినట్టు సీఐ పీవీ రమణ తెలిపారు. సైకో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించవచ్చన్న అనుమానంతో ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.