గుజరాత్ కు మోడీ అన్యాయం చేశారు: వాఘేలా
అహ్మదాబాద్: కేంద్ర మంత్రి పదవుల కేటాయింపు విషయంలో గుజరాత్ కు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా విమర్శించారు. సొంత రాష్ట్రానికి నరేంద్ర మోడీ అన్యాయం చేశారని ఆరోపించారు. కేవలం ఒకటిన్నర పదవులు మాత్రమే ఇచ్చి గుజరాత్ ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు. గుజరాత్ నుంచి 26 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒకటిన్నర పదవి మాత్రమే ఇస్తారా అంటూ ప్రశ్నించారు.
గుజరాత్ నుంచి భారుచ్ ఎంపీ మన్సుఖ్ వాసవకు మాత్రమే గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి పదవి దక్కింది. మోడీతో కలుపుకుని ఒకటిన్నర పదవులుగా వాఘేలా లెక్కగట్టారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించినా వారు తమ రాష్ట్ర ప్రతినిధులుగా పరిగణించబోమని స్పష్టం చేశారు.