కెప్టెన్సీ వల్ల అతను రాటుదేలాడు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా నియమించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ దేశ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. గత ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన పంజాబ్ జట్టు ఈసారి అనూహ్యంగా సారథిగా మాక్స్‌వెల్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా క్రికెటర్ హషిం ఆమ్లాను, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను పక్కనబెట్టి మరీ మాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ ఇచ్చింది.
అతని సారథ్యంలో పంజాబ్ జట్టు శుభారంభాన్ని చేసింది. వరుసగా రెండు విజయాలు సాధించింది. ఛేజింగ్ విజయాలైన ఈ రెండు మ్యాచ్‌లలోనూ 44, 43 పరుగులు చేసిన మాక్స్‌వెల్.. ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ స్పందిస్తూ.. కెప్టెన్సీ మాక్స్‌వెల్‌ను రాటుదేల్చినట్టుందని, అతను తనలోని ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని సంతృప్తి వ్యక్తం చేశాడు.
‘అతన్ని కెప్టెన్‌ను చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, అతనికీ అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఇది అతనిలోని ఉత్తమ ప్రతిభను వెలికితీస్తున్నదని భావిస్తున్నా. ఐపీఎల్ క్రికెట్‌లో అతను కొనేళ్ల కిందట అంత బాగా రాణించలేదు. కానీ గత ఏడాది నుంచి అతను బాగా ఆడుతున్నాడు’ అని పాంటింగ్ అన్నాడు. ఇటీవల ఇండియాతో జరిగిన టెస్టులో తొలి సెంచరీని మాక్స్‌వెల్ సాధించాడని, అతను మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని పాంటింగ్ చెప్పాడు.