
ప్లీజ్ వాళ్లనూ ఐపీఎల్‌లో ఆడనివ్వండి!
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఉద్రిక్తతలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-10వ ఎడిషన్‌లో దాయాది క్రికెటర్లను కూడా ఆడనివ్వాలని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ అభిప్రాయపడ్డారు.
'ఐపీఎల్ ప్రపంచ క్రీడాకారులు ఆడుతున్నారు. ఆఖరికీ అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు కూడా అరంగేట్రం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే పాకిస్థాన్ ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోండి. క్రీడల్లో పెద్దతనం చాటుకుందాం. ప్లీజ్' అంటూ రిషీ కపూర్ ట్వీట్ చేశారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 2008 నుంచి పాకిస్థాన్ క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్‌లో ఆడటం లేదు. తాజా ఐపీఎల్-2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ అనే అఫ్ఘన్ క్రికెటర్లు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రిషీ కపూర్ విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్రీడలు రాజకీయాలకు అతీతంగా ఉండాలంటే.. మరికొందరు ఇలా కామెంట్ చేయడం అవమానకరమని వ్యాఖ్యానిస్తున్నారు.