22 మందికి 'ఉరి'.. ఇంకా 2 వేలమంది..
టెహ్రాన్: ఉత్తర ఇరాన్లోని కరగ్ నగరంలో 22 మంది ఖైదీలకు ఉన్నతాధికారులు శనివారం ఉరిశిక్షని అమలు చేశారు. గిజల్ హసర్ కారాగారంలో ఈ ఉరిశిక్షలు అమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే 22 మంది ముకుమ్మడి ఉరిశిక్షలపై ఇరాన్ మానవహక్కుల సంఘాలు బుధవారం మండిపడ్డాయి. ఈ చర్యని ముక్తకంఠంతో ఖండించాయి.
ఉరిశిక్ష అమలు చేసిన 22 మంది ఖైదీలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పట్టుబడిన వారేనని....చాలా మంది విచారణలో ఉన్నవారేనని సదరు సంఘాల అధ్యక్షుడు స్పష్టం చేశారు. గతేడాది జైల్లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారికి కూడా ఉరిశిక్ష విధించారని చెప్పారు. ఈ ముకుమ్మడి ఉరిశిక్షలు వెంటనే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 మందికి ఉరిశిక్షని అమలు చేశారని గుర్తు చేశారు. ఇరాన్లో అతిపెద్ద జైళ్లలో ఒక్కటైన గిజల్ హసర్లో దాదాపు 2 వేల మంది ఖైదీలు ఉన్నారు. వారంతా మాదకద్రవ్యాల అక్రమ రవాణ కేసులో పట్టుబడిన వారే వారందరికీ ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఖైదీలకు ఉరిశిక్ష అమలును వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితికి ఇరాన్లోని మానవ హక్కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి.