Iran Human Rights group
-
‘గీత’ దాటితే శిక్ష తప్పదు.. హిజాబ్ అల్లర్లపై అధ్యక్షుడి ‘రెడ్ లైన్’
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు కదంతొక్కటంతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నారు. మరోవైపు.. నిరసనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బుధవారం తలెత్తిన గందరగోళ పరిస్థితులను తప్పుపట్టారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని రైసీ హెచ్చరించారు. ‘పౌరుల రక్షణే ఇరాన్ ప్రజల రెడ్ లైన్. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరికీ అధికారం లేదు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం‘ అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని, ఇరాన్‌కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందని.. ఫోరెన్సిక్, నిపుణుల బృందం నివేదిక త్వరలోనే వస్తుందని తెలిపారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే 22 ఏళ్ల యువతి సెప్టెంబర్ 16న పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. అమీని మరణించిన మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి -
ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తున్నాయి. కొత్త నగరాలు, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి, నిర్బంధ హిజాబ్ ధారణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు నిరసనలను ఇరాన్ భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. భద్రతా సిబ్బంది దాడుల్లో ఇప్పటిదాకా 50 మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ హ్యూమన్ రైట్స్(ఐహెచ్ఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రకటించింది. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని రెజ్‌వన్‌షాహర్ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు బలయ్యారని తెలియజేసింది. బబోల్, అమోల్‌లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయా పట్టణాల్లో కాల్పుల్లో పలువురు మృతిచెందారని ఫ్రాన్స్ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ అత్యున్నత మతపెద్ద ఖమేనీ విగ్రహాన్ని ఆయన స్వస్థలం మషాద్‌లో నిరసనకారులు దహనం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా టెహ్రాన్‌లో పలువురు ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్లో పరిస్థితులపై ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
22 మందికి 'ఉరి'.. ఇంకా 2 వేలమంది..
టెహ్రాన్: ఉత్తర ఇరాన్‌లోని కరగ్ నగరంలో 22 మంది ఖైదీలకు ఉన్నతాధికారులు శనివారం ఉరిశిక్షని అమలు చేశారు. గిజల్ హసర్ కారాగారంలో ఈ ఉరిశిక్షలు అమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే 22 మంది ముకుమ్మడి ఉరిశిక్షలపై ఇరాన్ మానవహక్కుల సంఘాలు బుధవారం మండిపడ్డాయి. ఈ చర్యని ముక్తకంఠంతో ఖండించాయి. ఉరిశిక్ష అమలు చేసిన 22 మంది ఖైదీలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పట్టుబడిన వారేనని....చాలా మంది విచారణలో ఉన్నవారేనని సదరు సంఘాల అధ్యక్షుడు స్పష్టం చేశారు. గతేడాది జైల్లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారికి కూడా ఉరిశిక్ష విధించారని చెప్పారు. ఈ ముకుమ్మడి ఉరిశిక్షలు వెంటనే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 మందికి ఉరిశిక్షని అమలు చేశారని గుర్తు చేశారు. ఇరాన్లో అతిపెద్ద జైళ్లలో ఒక్కటైన గిజల్ హసర్లో దాదాపు 2 వేల మంది ఖైదీలు ఉన్నారు. వారంతా మాదకద్రవ్యాల అక్రమ రవాణ కేసులో పట్టుబడిన వారే వారందరికీ ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఖైదీలకు ఉరిశిక్ష అమలును వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితికి ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి.