కొత్త వలస విధానంపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాక్‌కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కొత్త వలస విధాన చట్టంలో నిషేధిత దేశాల జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించిన తర్వాత ఈ విషయం వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ వలస విధానం గురించి ప్రసంగించారు. దేశ భద్రతను పెంచడం, పకడ్బందీగా చట్టాలను అమలు చేయడం, అమెరికన్లకు ఉద్యోగాలను, వేతనాలు పెంచడంపై దృష్టిసారిస్తున్నామని, కొత్తవలస విధాన చట్టం సానుకూలంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ ఉత్తర్వులు చెల్లవంటూ అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆయా దేశాలకు చెందినవారికి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త వలస విధాన చట్టం తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించారు. ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురానున్నారు. ట్రంప్ దీనిపై సంతకం చేయనున్నారు.