
ప్రధాని మోదీకి క్రికెట్ జెర్సీ, బ్యాట్, బంతి..
డబ్లిన్: భారత పర్యటనకు వచ్చే ప్రపంచ దేశాల నాయకులకు గానీ.. విదేశీ పర్యటనకు వెళ్లినపుడు ఆయా దేశాధినేతలకు గానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అపురూపమైన కానుకలు ఇస్తుంటారు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశ ప్రధాని కెన్నీ కోసం అరుదైన కానుక తీసుకెళ్లారు. అయితే మోదీ కూడా ఈసారి ఊహించని కానుకలు స్వీకరించారు.
బుధవారం ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీతో మోదీ సమావేశమయ్యారు. మోదీకి ఘన స్వాగతం పలికిన కెన్నీ.. వినూత్న కానుకలు బహూకరించారు. ఐరీష్ జాతీయ క్రీడయిన హర్లింగ్ బ్యాట్, బంతిని మోదీకి అందజేశారు. ఐరీష్ క్రికెట్ టీమ్ జెర్సీని మోదీకి బహూకరించారు. ఇక మోదీ భారత ప్రాచీన గ్రంధాల నుంచి సేకరించిన రాతప్రతుల పునరుత్పత్తులను కెన్నీకి అందజేశారు. ఇరు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.